మొన్నటి దాక, జగన్ కేసుల్లో కొంచెం బెట్టు సడలించిన, సిబిఐ, మళ్ళీ జగన్ కేసుల విషయంలో, పట్టు బిగిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంతో, జగన్ సఖ్యతగా ఉన్నారు కాబాట్టి, ఇక కేసుల విషయంలో ఎలాంటి పురోగతి ఉండదని అందరూ అనుకున్నారు. కేసులు కొట్టేసే అవకాసం ఉండదని, జగన్ ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అని, కాకపోతే, విచారణ జాప్యం చేసే అవకాసం ఉందని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్టుగానే, జగన్ తాను ప్రతి వారం కోర్ట్ కి రాలేను అని చెప్పారు. అయితే ఎవరూ ఊహించని విధంగా, సిబిఐ, ఎంతో ఘాటుగా వాదనలు వినిపించింది. జగన్ ఎంపీగా ఉండగానే సాక్ష్యులను బెదిరించారని, ఇప్పుడు సియం అని, అతన్ని విచారణకు రావాల్సిందే అని తెలిపింది. అంతకు ముందు, పెన్నా చార్జ్ షీట్ విషయంలో, అదనపు చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక ఈ రోజు ఓబుళాపురం మైనింగ్ కేసు విషయంలో దూకుడు పెంచింది సిబిఐ.
హైకోర్టు విభజన నేపథ్యంలో.. ఏయే కేసులు ఎక్కడ విచారణ జరపాలో సెప్టెంబర్ 3న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, దాని ప్రకారం ఓబుళాపురం మైనింగ్ కేసు కేసును విశాఖకు బదిలీ చేయాలని సిబిఐ, కోర్ట్ ని కోరింది. ఈ కేసును విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ కోరింది. అయితే ఈ రోజు, సిబిఐ అనూహ్యంగా తన వాదనను మార్చేసింది. ఈ కేసును హైదరాబాద్ నుంచి విశాఖకు బదిలీ చేయొద్దని కోరుతూ సవరించిన మెమోను సిబిఐ కోర్ట్ ముందు దాఖలు చేసింది. ఈ నేరం జరిగిన సమయంలో నిందితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నివాసులేనని సీబీఐ పేర్కొంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర విభజన జరగకముందే ఛార్జిషీట్లు దాఖలయ్యాయని పేర్కొంది. ఓఎంసీ కేసును విశాఖకు బదిలీ చేస్తే విచారణ మరింత ఆలస్యమవుతుందని.. హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే విచారణ జరపాలని కోరింది.
అయితే ఈ విషయంలో సిబిఐ, ఇలా మాట మార్చటం వెనుక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ఉందా అనే అనుమానం కలుగుతుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నంలో ఉన్న సిబిఐ కార్యాలయాన్ని, విజయవాడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఎందుకు ఇచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. రాష్ట్రమంతా కార్యాలయాలు ఉండాలని, అన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు ఉండాలని, అందుకే అమరావతిని నిలుపుదల చేసాం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం, సిబిఐ కోర్ట్ ని విశాఖ నుంచి విజయవాడ తరలించటంలో మర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ రోజు సిబిఐ వాదనలు విన్న తరువాత, జగన్ ప్రభుత్వ నిర్ణయానికి, సిబిఐ మొన్నటి దాక వైజాగ్ కి బదిలీ చెయ్యమని, ఇప్పుడు వద్దు హైదరాబాద్ లోనే విచారణ చెయ్యాలి అని చెప్పటానికి, ఏమైనా లింక్ ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి.