కరోనా వైరస్‌తో ప్రభావితమైన 75 జిల్లాల బంద్‌కు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31వరకు రాష్ట్రాల మధ్య బస్సుల బంద్‌కు పిలుపునిచ్చింది. కరోనాతో ప్రభావితమైన 75 జిల్లాల్లో ఆంక్షలపై త్వరలో రాష్ట్రప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తాయని పేర్కొన్నారు అధికారులు. ఆ 75 జిల్లాల్లో అత్యవసర సేవలు మాత్రమే అందించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం, విజయవాడ, విశాఖపట్నం, ఈ లిస్టు లో ఉన్నాయి. అలాగే తెలంగాణా నుంచి, కొత్తగూడెం, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశం వేదికగా కేంద్రానికి నివేదించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 5వరకు సైనిక బలగాల తరలింపును రద్దు చేశారు అధికారులు. సెలవులు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 5 వరకు ఎక్కడివారక్కడే కొనసాగాలని స్పష్టంచేశారు. జవాన్లు అందరూ తమ కుటుంబసభ్యులు ఎవరూ విదేశాల్లో ప్రయాణించలేదన్న డిక్లరేషన్‌ను సమర్పించాలని ఆదేశించారు అధికారులు. విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరో పక్క, జనతా కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
సీఎస్, డీజీపీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం నియమించిన పర్యవేక్షకుడు సురేష్ కుమార్, ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి చర్చించారు. రాష్ట్రంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంపై విస్త్రత స్థాయిలో చర్చ జరిగింది.విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రం నిర్దేశించిన ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరించాల్సి ఉందని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అలాగే కరోనా అనుమానిత కేసులకు సంబంధించి ఐసోలేషన్ వార్డులు, చికిత్సలకు సంబంధించి ఉపకరణాలు, ఔషధాలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ తరహాలోనే మరో రెండు రోజులు ఇదే తరహాలో కర్ఫ్యూ కొనసాగించాలనే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.