"కరోనా సమస్య ప్రస్తుతం అందరినీ కలవరపరుస్తున్న అతి ప్రధాన సమస్య. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి. ఇటు ప్రభుత్వం, ప్రజలు అంతా కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ సంక్షోభం నుంచి బైటపడలేం. మొదటి దశలో విదేశాలనుంచి వచ్చినవాళ్లనుంచి సోకుతుంది. రెండవ దశలో వారినుంచి స్థానికులకు వ్యాపిస్తుంది. స్టేజి 3లో అంటువ్యాధిగా ఈ మహమ్మారి విజృంభిస్తుంది. 4వ దశకు వస్తే దీనిని ఆపడం అసాధ్యం. దీని నిరోధానికి మార్గాలు ఇవే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సామాజిక బాధ్యత నిర్వర్తించాలి. విదేశాలనుంచి వచ్చిన వారందరికీ క్వారంటైన్ చేయాలి. 14రోజులు పకడ్బందీగా క్వారంటైన్ లో ఉండి నెగటివ్ వస్తేనే వాళ్లను బైటకు పంపాలి. కానీ ఇక్కడ మనదగ్గర క్వారంటైన్ పెట్టలేక పోయారు. దీనివల్ల కొంత విస్తరించే ప్రమాదం ఏర్పడింది. ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తే చాలదు, దీనికోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు నెలకొల్పాల్సివుంది. ప్రధాని పిలుపు జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సంఘీభావంగా నిలిచారు. రైల్వే సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు రద్దు చేశారు. అంతర్ జిల్లా రాకపోకలను కూడా మహారాష్ట్ర రద్దు చేసింది. దేశీయ విమాన సర్వీసులు ఈ అర్ధరాత్రి నుంచి ఆపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్గం ఒక్కటే...అందరూ సామాజిక దూరం విధిగా పాటించాలి.
డిజిటల్ సోషలైజేషన్ ద్వారా సమాచార మార్పిడి జరగాలి, ఉద్యోగులు తమ విధులను డిజిటల్ సోషలైజేషన్ ద్వారా నిర్వర్తించాలి. సెల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ముఖాముఖి చర్చించుకుని, విధులు నిర్వర్తించాలి. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార మార్పిడి జరగాలి. డిజిటల్ సోషలైజేషన్ మాత్రమే ప్రస్తుత సమయంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గం. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా డిజిటల్ వర్క్ చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, అందరిలో అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగకరం. ఇళ్లలోనుంచే కార్యాలయ విధులు నిర్వర్తించే పరిస్థితి కల్పించాలి. డిజిటల్ వర్కింగ్ ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఒక్కరోజులే మన ఎకానమి 4వేల పాయింట్లు పడిపోయింది. అసంఘటిత రంగంలో కార్మికులు పెద్దఎత్తున ఉపాధి కోల్పోయారు. అనేకరాష్ట్రాలలో 144సెక్షన్ విధించారు. ఇంటికొకరే బైటకెళ్ళి టూ వీలర్ పై ఒకరు, కార్లలో ఇద్దరే బైటకు వెళ్లి అత్యవసర విధులు నిర్వర్తించాలని ఆంక్షలు వచ్చాయి. ప్రపంచంలో 20% ఇళ్లవద్దే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్రమోది ప్రకటించిన లాక్ డౌన్ కంపల్సరీగా అందరూ ఆమోదించాలి, ఆచరించాలి. అప్పుడే ఈ భయంకరమైన వైరస్ ను నిరోధించ గల్గుతాం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పాటించకపోవడం కరెక్ట్ కాదు, అందరూ దీనిని ఆచరిస్తేనే కరోనా మహమ్మారిని పారదోలగలం. ఇండియా ఏవిధంగా దీనిని నిరోధిస్తుందో చూడాలని, ఇండియా దీనిని కట్టడి చేయగలిగితే ప్రపంచానికి కూడా కొంత ఊరట వస్తుందని, ఈ వ్యాధిని నియంత్రించగలరని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య కూడా ఎదురు చూస్తోంది.
కరవు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. కోళ్ల పరిశ్రమ, ఆక్వా పూర్తిగా దెబ్బతింది. హార్టీకల్చర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే చురుగ్గా వ్యవహరించాలి. ఆన్ లైన్ వినియోగం ద్వారా రైతులను ఆదుకునే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిచోటా పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే చొరవ చూపాలి. పిడిఎస్ ద్వారా ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా నిత్యావసరాలను సరఫరా చేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాటించాలి. అందుబాటులో ఉన్న శానిటైజర్లు, సబ్బుల ద్వారా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. టచ్ పాయింట్స్ పూర్తిగా తగ్గించుకోవాలి. తలుపులు తీసినప్పుడు, వేసినప్పుడు, లిప్ట్ పాయింట్స్, డోర్ బెల్స్ తదితరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్స్,మాస్క్ లు ఇతర పారిశుద్య వస్తువులపై పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి. కరెన్సీ నోట్లు, నాణేల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. ఆన్ లైన్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామాలు,వార్డులలో పరిశుభ్రత పాటించాలి. ఆయా శాఖలు శరవేగంగా స్పందించి పారిశుద్య చర్యలు చేపట్టాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.
కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికి గుర్తింపు కార్డులు అందజేసి ఇళ్ల దగ్గరనుంచి ఆసుపత్రులకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. నరేగాలో సెక్షన్ 7 ప్రకారం మొదటి 30రోజులు పని కల్పించలేకపోతే 25% వేతనాలు చెల్లించాలని, 30రోజుల తర్వాత కూడా పని కల్పించలేకపోతే 50% వేతనాలు చెల్లించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ముందుకొచ్చి స్పందించాలి. ఈ పరిస్థితుల్లో నలుగురికి ఒకేచోట చేర్చి ఉపాధి కల్పించలేం. కాబట్టి ఉపాధి కూలీలకు పరిహారం చెల్లించి ఆదుకోవాలి. నరేగా పనులు లేక ఉపాధి కోల్పోయిన కూలీలకు ప్యాకేజి ప్రకటించాలి. కేరళలో రూ 20వేల ప్యాకేజి ఇచ్చింది, ఉపాధి హామీలో కోల్పోయిన కూలీలకు ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలి. తెలంగాణలో నిత్యావసరాలు ఇచ్చి రూ 1500చొప్పున నగదు ఇచ్చారు. హుద్ హుద్ వచ్చినప్పుడు బాధితులకు ప్యాకేజి ఇచ్చాం. 50కిలోల బియ్యం ఇచ్చాం, 5లీటర్ల కిరోసిన్, కందిపప్పు కిలో, పామాయిల్ లీటర్, కారం పొడి, ఉప్పు అరకేజి చొప్పున 3కిలోల బంగాళ దుంపలు, 2కిలోల ఉల్లిపాయలు ఇవ్వడంతోపాటు ఏవైనా వస్తువులు కొనుక్కోడానికి రూ 4వేల నగదు ఇచ్చి ఆదుకున్నాం. హుద్ హుద్ లో ఇచ్చినట్లే ఇప్పుడీ కరోనా విపత్తులో కూడా పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణితోపాటు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలి. మొదటి కేసు చైనాలో పుట్టి అక్కడనుంచి 60రోజుల్లో లక్షకు చేరితే, ఇప్పుడు 11రోజుల్లోనే 2లక్షలు అదనంగా పెరిగింది. ఇప్పుడీ సాయంత్రానికి 4లక్షలకు చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకరు బైటకెళ్లి 100మందికి వ్యాపింపజేస్తే ఇది తీవ్ర మహమ్మారిగా పరిణమిస్తుంది.
సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసి (సిడిడిఈపి) అమెరికాలోని ఫ్రిన్స్ టన్ యూనివర్సిటి అంచనాల ప్రకారం, జన సాంద్రత ఎక్కువ ఉండే ఇండియాలాంటి ప్రదేశంలో 20కోట్ల నుంచి 30కోట్లకు ఈ వ్యాధి విస్తరించే ప్రమాదం ఉందని, 20లక్షల నుంచి 50లక్షలమంది చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనంలోకి తీసుకోవాలి, ప్రభుత్వాలు కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఈ రోజే రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేశారు. ఎమ్మెల్యేలంతా ఓటేయడానికి వస్తే టచ్ పాయింట్లు పెరిగే ప్రమాదం ఉందని, ఇది మరింత విస్తరిస్తుందని, అది సమాజానికి ముప్పుగా పరిణమిస్తుందని ఎల్లుండి జరగాల్సిన ఎన్నికను ఈ రోజు వాయిదా వేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఆలోచించాల్సివుంది. జరగరానిది జరిగితే చారిత్రక తప్పిదం చేసినవాళ్లం అవుతాం. దీనిపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను అందరూ పాటించాలి. ప్రజలు మాత్రమే అనుసరిస్తే చాలదు, సంస్థలు, ప్రభుత్వాలన్నీ బాధ్యతగా పనిచేయాలి. ఇది మనందరి సామాజిక బాధ్యత.
ఇప్పటికే కరోనా వల్ల 16,600మంది చనిపోయారు. 3,75,000మందికి సోకిందని తెలుస్తోంది. వీళ్లంతా పరీక్షలు చేయబడినవారు. ఇక పరీక్షలు చేయని వాళ్లెంతమంది ఉన్నారో ఆలోచించాలి.. కొంతమందిలో కరోనా బైటపడుతుంది, ఇంకొంతమందిలో అది బైటపడదు. కరోనా వైరస్ ఉండి బైట పడనివాళ్లు బహిరంగంగా తిరగడంవల్ల వాళ్లు క్యారియార్లుగా మారి ఇతరులకు విస్తరించే ప్రమాదం ఉంది. దీనిని నివారించాలంటే స్వీయ నిర్భంధం ఒక్కటే మార్గం. టచ్ పాయింట్లు లేకుండా నివారించుకోవాలి. డిజిటల్ సోషలైజైషన్ ద్వారా ఇళ్లలోనే ఉండి మీ విధులను నిర్వర్తించుకోవాలి. దీనికి అందరూ ముందుకు రావాలని అదే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యక్తిగతంగా, సామాజికంగా అన్ని రకాల ముందు జాగ్రత్తలు పాటిస్తే దీనిని కొంతవరకు ఎదుర్కొగలుగుతాం. బారినుంచి బైటపడగలం. రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని ఏపి ప్రభుత్వం తెలుసుకోవాలి. విమర్శలు చేయడానికి ఇది సమయం కాదు. విమర్శలు చేయాలంటే మేము కూడా చేయగలం కానీ ఇది అలాంటి సందర్భం కాదు. తెలుగుదేశం పార్టీకి రాజకీయాల కన్నా ప్రజారోగ్యం ముఖ్యం. స్వార్ధం కోసం చేసేది, వ్యక్తిగత లాభం కోసం చేసేది రాజకీయం కాదు. కరోనా వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న ఈ సమయంలో ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తే ప్రజలు మనలను క్షమించరు. ఇప్పుడు కావాల్సింది ప్రజలకు స్వాంతన. ఇప్పుడు జరగాల్సింది కరోనా వైరస్ ను ఏవిధంగా ఎదుర్కొంటాం, ప్రజలను ఏవిధంగా చైతన్య పరుస్తాం అనేది ఇప్పుడు కావాలి. సామాజిక దూరం పాటించడం ఇప్పటి తక్షణ ఆవశ్యకత. ప్రజలను కాపాడుకోవడం ఇప్పుడు మనందరికీ ముఖ్యాంశం. డిన్నర్లు, జాతరల పేరుతో ఒకేచోటకు అందరూ చేరడం మంచిది కాదు. సామాజిక దూరం అందరూ విధిగా పాటించాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన చుట్టుపక్కల వాళ్లను కాపాడుకోవాలి. వైరస్ సోకినవాళ్లు, సోకనివాళ్లు అందరూ బాధ్యతగా ప్రవర్తించాలని, భయంకరమైన ఈ వ్యాధిని ఎదుర్కోవడం మనందరి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం."