ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వీటిపై వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచింది. ఈ ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ కు 76 పైసలు, ఒక లీటర్ డీజిల్ కు రూ. 1.07 పైసలుగా పెంపు ఉంటుంది. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై 31శాతం వ్యాట్ తో పాటు 2.76 సర్ చార్జి, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ తో పాటు అదనంగా రూ. 3.07 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలోనే వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచింది. గత నెలలో పెట్రోల్, డీజిల్ పై 4.5 శాతం వ్యాటు , ప్రభుత్వం పెంచింది. దీంతో పెట్రోల్ ధర 31 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. డీజిల్‌పై 22.5 శాతం నుంచి 27శాతానికి పెంచింది. తాజాగా సరిగ్గా నెలరోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వ్యాట్ పేరుతో ధరలు పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 76.09 పైసలు ఉండగా ఆదివారం నుంచి 76 పైసలు వ్యాట్ రూపంలో పెంచడంతో రూ. 77.04 కి పెరగనుంది. అలాగే లీటర్ డీజిల్ ధర ప్రస్తుతం రూ. 70.67 పైసలు ఉండగా రూ. 1.07 పైసలు పెరిగింది.
దీంతో ఆదివారం నుంచి డీజిల్ ధర రూ.71.74 పైసలుకు పెరగనుంది. ఇప్పటికే వివిధ రూపాల్లో ధరలు పెరగడంతో సామాన్యులు మోటారు వాహనాలను నడిపే పరిస్తితి లేదు. పెట్రోడీజిల్ ధరలు ఇదే విధంగా పెరుగుతూ పోతే ఆ ప్రభావం ఇతర నిత్యావసర సరుకులపై పడే ప్రభావం ఉంది. పెట్రోల్ ధరలు పెరగడంతో రాష్ట్ర రాజధాని విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రధాన నగరాల్లో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఏపీఎస్ఆర్టీసీ బస్ చార్జీలను గతేడాదిలోనే భారీగా పెంచింది. పెరిగిన ధరలతో ఇప్పటికే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. దీనివల్ల మరోసారి నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టోల్ గేట్లు రూపంలో వేల రూపాయిలు చెల్లిస్తున్నామని, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా చార్జీలు మిగలకపోగా వాహనాల తరుగుదల, మరమ్మతులు ఆర్ధికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాపోతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల వాహనాలను తిప్పే పరిస్తితి లేదని తమ కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశాలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉండటం వల్ల ఆయా ప్రాంతాలకు కిరాయిల నిమిత్తం వెళ్లే వాహనాలు అక్కడే తమ వాహనాలకు డీజిల్, పెట్రోలు పోయించుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ప్రధానంగా రాష్ట్రానికి వాణిజ్య పన్నులు శాఖ నుంచి అధికంగా ఆదాయం వస్తుంది. పెట్రో, డీజిలు ఆ రంగానికి చెందినవి కావడంతో రాష్ట్ర ఖజానాకు చిల్లులు పడుతున్నాయి. పెట్రో, డీజిల్ ధరల్లో కనీసం రూ. 1.50 నుంచి రూ.2 వరకూ వ్యత్యాసం ఉండటంతో ఇతర రాష్ట్రాల్లో ఆయిల్ పోయించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దుగా ఉన్న మధిరలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.42 పైసలు ఉంటే ఏపీలో రూ.77.04 గా ఉంది. డీజిల్ ధర లీటర్ కు రూ. 70.25 పైసలు ఉంటే రూ. 71.74కి పెరిగింది. తెలంగాణలోని కోదాడలో రూ. 76.43 పైసలు, డీజిల్ రూ.70.26 పైసలుగా ఉన్నాయి. తమిళనాడు సరిహద్దులో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.73 పైసలు ఉండగా, డీజిల్ ధర రూ. 68.27 పైసలు ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే నెల రోజల్లో ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.