దూకుడు నిర్ణయాలతో, వాటి పర్యావసానాలు ఆలోచించకుండా, ఏది తోస్తే అది చేస్తూ, ఎవరి మాట వినకుండా, స్పీడ్ గా వెళ్తున్న జగన్ కు, ఎప్పటికప్పుడు హైకోర్ట్ బ్రేకులు వేస్తూనే ఉంది. ప్రతి రోజు, ఏదో ఒక విషయంలో, ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ చేతిలో ఎదురు దెబ్బలు, మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. తమకు మంద బలం ఉంది, తాము చెప్పిందే వేదం అంటూ, రూల్స్ పాటించుకుండా వెళ్తున్న జగన్ ప్రభుత్వానికి ఈ రోజు ఇప్పటి వరకు, రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. మొదటిది, వైజాగ్ లో చంద్రబాబుని, 151 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి, అరెస్ట్ చెయ్యటం పై, ఈ రోజు విచారణలో, ఏకంగా డీజీపీనే వచ్చి సమాధానం చెప్పమని కోరటం. ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పై. జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ అంటూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కోర్ట్ లు కొట్టేస్తాయి అని అందరికీ తెలిసిందే. అయినా సరే, జగన్ ప్రభుత్వం, ఎందుకు ముందుకు వెళ్లిందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.
ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పై హైకోర్టులో విచారణ జరిపింది. ప్రభుత్వం ఇచ్చిన 59.85 శాతం రిజర్వేషన్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్ చెల్లదన్న కోర్టు...నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలిపింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడం సుప్రీం తీర్పునకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల తరువాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల పై, ప్రభుత్వం ఇచ్చిన జీవోని ప్రభుత్వం రద్దు చేసింది. హైకోర్ట్ ఆదేశాలు నేపధ్యంలో, ఎలా ముందుకు వెళ్ళాలి అనేదాని పై, ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. సుప్రీం కోర్ట్ కు వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని పై చర్చలు జరుపుతున్నారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాల రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. అవసరమైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. తొమ్మిది నెలల పాలనలో బలహీన వర్గాల కోసం వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ పథకాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీల రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెదేపా కేసు వేసిందంటూ మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేసున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకు అండగా ఉన్నది బీసీలేనన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. న్యాయస్థానం చెప్పిందని బీసీల రిజర్వేషన్ తగ్గిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు.