ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో, ప్రజా చైతన్య యాత్ర చెయ్యనున్నారు. మూడు రాజధానుల ప్రకటన తరువాత, చంద్రబాబు మొదటి సారిగా వైజాగ్ వెళ్తున్నారు. అలాగే వైజాగ్ లోని, పెందుర్తిలో ల్యాండ్ పూలింగ్ బాధితులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తన పర్యటన పై చంద్రబాబు ఇప్పటికే, ప్రకటన చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఆమోదిస్తున్నప్పటికీ జగన్ మాత్రం మూడు రాజధానులు కావాలంటూ పట్టుబట్టడంలో 6 వేల ఎకరాల భూములను వైజాగ్ లో కొల్లగొట్టి తద్వారా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ భూబాగోతాన్ని బయటపెడతానని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలంటూ రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపై ఆమోదిస్తుంటే జగన్ ఉన్మాది గా వ్యవహరిస్తూ ప్రజా మనోభావాలను, భవిష్యత్తును తాకట్టుపెడు తున్నారని విమర్శించారు.
ఈ అధికారం ఆయనకు ఎవరు ఇచ్చా రని ప్రశ్నించారు. రాష్ట్రంలో సైతాన్ ఉందంటూ పారిశ్రామికవేత్తలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా జగన్ సైకో ఇజంకు భయపడి పారిపోతున్నారన్నారు. ఉన్న పరిశ్రమలను కూడా వైకాపా నాయకులు పెడుతున్న ఇబ్బందులు, వేధింపులకు ఈ రాష్ట్రం వైపే చూసేందుకు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించే పత్రిక వ్యవస్థపై ఎల్లో మీడియా అంటూ వితండ వాదంతో ఎదురు దాడికి దిగడం సమంజసం కాదన్నారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలు, సంక్షేమకార్యక్రమాలు, ప్రాజెక్టులను రద్దు చేయడం జరిగిందన్నారు. వీరి సైకో ఇజానికి పోలవరం ప్రాజెక్టు సైతం అటకెక్కించారన్నారు.
రెండు లక్షల కోట్ల సంపద అమరావతి ద్వారా సృష్టిస్తే దానిని నాశనం చేసేందుకు పూనుకోవడం బాధేస్తుందన్నారు. అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక వంటి ప్రజా ఉపయోగకరమైన పథకాలను రద్దు చేయడం ఎంత వరకు సబబు అన్నారు. అనాది కాలంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలు, ఫీజులు ప్రభుత్వం ఇస్తున్నదని, వీటిని ఉన్నట్టుండి విద్యాదివెన అంటూ నూత పథకాన్ని ప్రవేశ పెట్టడం నవ్వేస్తోందన్నారు. రాష్ట్రంలో మద్యం రాబడి తగ్గిందని, మద్యంలో కూడా పెద్ద స్కాం నడుస్తోందన్నారు. వైజాగ్ లో జగన్ చేస్తున్న భూకబ్జాలు అన్నీ రేపు బయట పెడతానని చంద్రబాబు అన్నారు. అయితే మరో పక్క వైసీపీ చంద్రబాబుని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఊరు నుంచి 100 మంది వచ్చి చంద్రబాబు ముందు నినాదాలు చెయ్యాలంటూ, వైసీపీ బెదిరింపుల, వాట్స్ అప్ సందేశం, ఇప్పటికే వైరల్ అయ్యింది. చూద్దాం రేపు ఏమి జరుగుతుందో.