నూతన సంవత్సరం తొలిరోజైన బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాలలో పర్యటించారు. గత 15రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్నివర్గాల ప్రజలకు సంఘీభావం తెలిపారు. యర్రబాలెంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ అందరికీ ఆనందంగా ఉండాల్సిన సందర్భం నూతన సంవత్సరం(2020). 29గ్రామాలే కాదు మొత్తం రాష్ట్రంలో అందరూ మనోవేదనలో ఉండటం బాధాకరం. 5కోట్ల ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం ఇది. భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. 25ఏళ్ల క్రితం హైదరాబాద్ అభివృద్దికి నాంది పలికాం. అప్పుడే ‘‘విజన్ 2020’’ రూపొందించి అభివృద్ది పనులు చేపట్టాం. హైదరాబాద్ అభివృద్ది చేసినందుకు నన్ను బ్లేమ్ చేసినవాళ్లు కూడా ఉన్నారు. నా కోసమో, నా కుటుంబం కోసమో, టిడిపి కార్యకర్తల కోసమో అభివృద్ది చేయలేదు. ఆంధ్రప్రదేశ్ కోసం,తెలుగు జాతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చేశాం. విభజన తరువాత ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం బెంచీలు, కుర్చీలు కూడా లేవు. రోషంతో ఈ ప్రాంతంలో అభివృద్ది చేశాం. నన్ను నమ్మి 33వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూములు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.
నా కులం, మనుషులు ఉన్నారని హైదరాబాద్ లో అభివృద్ది చేశానా..? జనం కోసం, రాష్ట్రం కోసం, జాతి కోసమే ఆలోచించాను. ఉద్యోగాలు చేయాలంటే మన బిడ్డలు చెన్నై, బెంగళూరు పోవాల్నా..? పాచిపనుల కోసం, మట్టిపని, కాపలా పనుల కోసం హైదరాబాద్ వెళ్లాల్నా..? అందుకే రోషంతో, పౌరుషంతో అమరావతి అభివృద్దికి నాంది పలికాం. అమరావతితో పాటు 13జిల్లాల సమగ్రాభివృద్ది చేపట్టాం. ఇప్పుడు ఒక కులం కోసమే చేశానని నాపై నిందలు వేస్తున్నారు. ఎర్రబాలెంలో కాపులు 8వేల మంది ఉన్నారు. బ్రాహ్మణులు 1500, యాదవులు 1400, గౌడ 600, పద్మశాలి 1400, ఎస్సీ ఎస్టీ 2వేలమంది పైగా ఉంటే కమ్మ 100మందే ఉన్నారు. అలాంటిది నాపై ఒక సామాజిక వర్గం ముద్ర వేస్తారా..? కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేసినట్లు అమరావతికి కూడా కులం ముద్రవేసి చంపేయాలని చూస్తారా..? ఈ ప్రాంతం అభివృద్ది చెందితే, ఇక్కడి భూమి విలువ పెరిగితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత కడుపు మంట..? ఎందుకంత కడుపు ఉబ్బరం..? 18కిమీ సీడ్ యాక్సిస్ రోడ్డు, 30పైగా రోడ్లు గ్రాఫిక్సా..? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, జడ్జిల బంగ్లాలు, ఐఏఎస్ ల నివాసాలు, పేదల హవుసింగ్ కాంప్లెక్స్ గ్రాఫిక్సా..? రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే, వీళ్లు డబ్బులు ఏమీ ఖర్చు చేయలేదని అంటారు..
3రాజధానులు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా..? ఎప్పుడో జరిగిన సౌతాఫ్రికా వీళ్లకు ఆదర్శమా..? తెలిసో తెలియకో కుంపటిని మీరంతా నెత్తిమీద పెట్టుకున్నారు. అగ్నిగుండాన్ని నెత్తికెత్తుకున్నారు. దానిని తీయలేరు, అది తీయకపోతే కాలిపోతుంది. పాదయాత్రలో ఊరూరా తిరిగి ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. నూతన సంవత్సరం ప్రజలందరిలో మంచి మార్పుకు నాంది కావాలి. ఎంతో బాధతో ఆవేదనతో 5కోట్ల ప్రజలకు చెబుతున్నాను. మార్పు రాకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. అభివృద్ది ద్వారా సంపద సృష్టించాలి. ఆ సంపదతో రాష్ట్రం ఆదాయం పెరగాలి. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందాలి. అప్పుడే పేదలకు సంక్షేమం చేయగలం. ఇదొక(అమరావతి) దివ్యక్షేత్రం..దీనికి ఎవరైనా చెడు తలపెడితే వాళ్లే దెబ్బతింటారు తప్ప ఈ ప్రాంతానికి ఏమీకాదు. అన్ని గ్రామాలు, వార్డుల నుంచి తెచ్చిన పుట్టమట్టి, పవిత్ర జలంతో మరింత శక్తివంతం చేశాం. ప్రజలే నాకు పోలీసులు..ప్రజలే నాకున్న బలం..పోలీసులను అడ్డం పెట్టుకుని, డమ్మీ కాన్వాయ్ లు తిప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిన పరిస్థితి..దేవుడి కంటె తానే గొప్ప అని దేవుడి ఊరేగింపు ఆపి సీఎం కాన్వాయ్ లో వెళ్తారు. ప్రజలే రక్షణగా ఉండి మందడం గ్రామానికి పవన్ కళ్యాణ్ ను తీసుకెళ్లారంటే అదీ నిజమైన అభిమానం. ఇక్కడికి వచ్చినప్పుడు, నేను చెట్టుకింద కూర్చున్నాను. నువ్వు కూర్చోలేదు, నేను కట్టిన ఏసి సెక్రటేరియట్ లో కూర్చున్నావు. నేను కట్టిన అసెంబ్లీలో కూర్చుని నన్ను తిట్టారు. నేను కట్టిన అసెంబ్లీలోనే నాకు మైకు ఇవ్వలేదు. అయినా ఏం బాధ లేదు. రాష్ట్రానికి చెడ్డపేరు తేకండి, వచ్చే పెట్టుబడులను అడ్డుకోకండి, పరిశ్రమలను వేరే ప్రాంతాలకు తరిమేసి యువత ఉపాధికి గండికొట్టకండి. రాజధాని మార్చం, ఇక్కడే కొనసాగిస్తామని రేపే మీరు చెబితే అభినందిస్తాం. తరలించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని’’ చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు.