ఆంధ్రప్రదేశ్ లో 150 మంది ఎమ్మేల్యేలతో గెలిచి, అత్యంత బలమైన పార్టీగా అవతరించిన వైసీపీ పార్టీకి వరుస కష్టాలు వస్తున్నాయి. వరుస పెట్టి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. గుంటూరు జిల్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదని, ఆమె క్రీస్టియన్ అంటూ, ఆమె కులం విషయంలో ఆరోపణలు రావటం, ఏకంగా రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు వెళ్ళటం, రాష్ట్రపతి భవన్ నుంచి, రాష్ట్ర ఎన్నికల అధికారికి, ఈ విషయం పై విచారణ చేసి, నిజా నిజాలు చెప్పాలి అని కోరటంతో, ఆమె పై విచారణ ప్రారంభం అయ్యింది. నిన్ననే ఉండవల్లి శ్రీదేవి విచారణకు హాజరయ్యి, ఆధారాలు సమర్పించారు. తాజగా, ఎమ్మెల్యే శ్రీదేవి కుల వివాదం లాగానే, హోం మంత్రి మేకతోటి సుచరిత పై కూడా ఇలాంటి కేసు నమోదు అయ్యింది. హోంమంత్రి మేకతోటి సుచరిత షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పై వివాదాల్లో చిక్కుకున్నారు. ఏకంగా హోం మంత్రి పైనే ఫిర్యాదు రావటంతో, అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
వివరాల్లోకి వెళ్తే, హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతిన్ధ్యం వహిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. యాదృచ్చికమో ఏమో కాని, గుంటూరులో మంగళవారం కుల కేసు విచారణ కోసం తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి హాజరైన రోజునే, హోంమంత్రి సుచరిత పై కూడా ఇలాంటి కేసే నమోదైంది. ఫోరమ్ ఫర్ ఇండిజీనస్ రైట్స్అనే సంస్థ, హోంమంత్రి మేకతోటి సుచరిత పై కంప్లైంట్ ఇచ్చింది. ఎస్సీ కుల ధృవీకరణను దుర్వినియోగం చేసినందుకు అస్సాం కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ ఈస్ట్ ఇండియా సంస్థ, హోం మంత్రి సుచరితపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు పై వెంటనే విచారణ జరపాలని కోరారు.
ఎస్సీ రిజర్వేషన్లను దుర్వినియోగం చేసారని, అందుకే సుచరితపై అవసరమైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్నిఈ సంస్థ కోరారు. ఆమె అఫిడవిట్లో ఎస్సీ అని చూపించి, ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసారని, కానీ ఇటీవల ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, తాను క్రైస్తవ మతాన్ని అచరిస్తున్నట్లు తెలిపారని, ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించి ఆ వీడియో క్లిప్పింగ్ ను కూడా, కంప్లైంట్ కు జత పరిచారు. దీని పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, ఎలక్షన్ కమిషన్ కోరారు. అయితే, ఈ విషయం విచారణ దాకా వస్తుందా, వీడియో ఆదరంతో, ఎన్నికల కమిషన్ విచారణ జరుపుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.