మొన్నటి దాకా జగన్ అక్రమాస్తుల కేసులో అందరికీ ఊరటలు లభిస్తూ వచ్చాయి. దీని పై రాజకీయ పార్టీలు అనుమానాలు కూడా వ్యక్తం చేసాయి. బీజేపీకి, జగన్ దగ్గర అవ్వటంతోనే, ఇలా జరుగుతూ వస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. సిబిఐ, ఈడీ కూడా అంత సీరియస్ గా పట్టించుకోవటం లేదని, కోర్ట్ ల్లో సమర్ధవంతంగా వాదించటం కాని, పై కోర్ట్ ల్లో అపీల్ కూడా చెయ్యటం లేదని, ఆరోపణలు వస్తూ వచ్చాయి. ఇక జగన్ కేసులు, నెమ్మదిగా నీరుగారి పోతాయని అందరూ అనుకుంటున్న టైంలో, సిబిఐ మళ్ళీ ఆక్టివేట్ అయ్యింది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ఆదిత్య నాద్ దాస్ ను జగన్ కేసుల నుంచి తప్పిస్తూ, ఇచ్చిన తీర్పు పై, సిబిఐ సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. దీంతో సుప్రీం కోర్ట్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కేసు నుంచి ఆదిత్యనాద్ ను తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగిల బెంచ్ శుక్రవారం దీనిపై విచారణ చేపట్టి, ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు ఈ విషయం పై ఆదిత్యనాద్ దాస్ కు నోటీసులిచ్చింది. ప్రస్తుతం, ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పాటు, ఆదిత్యనాథ్ దాస్ దూకుడు పై కూడా కేంద్రం గుర్రుగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ లోపే ఇటు కోర్ట్ నుంచి కూడా ఆదిత్యనాథ్ దాస్ కు మళ్ళీ నోటీసులు రావటంతో, ఆయనకు మరింత ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఆదిత్యనాథ్ దాస్ ఇచ్చే సమాధానం బట్టి, సుప్రీం కోర్ట్ ఒక నిర్ణయం తీసుకోనుంది.
అభియోగాలివీ.. రాజశేఖర్ రెడ్డి సియంగా ఉన్న సమయంలో, నిబంధనలకు విరుద్ధంగా ఇండియా సిమెంట్స్‌కు అదనపు నీటిని కేటాయించారని, దీనికి అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బాధ్యులని ఆరోపించింది. దీనికి ప్రతి ఫలంగానే, ఇండియా సిమెంట్స్ జగన్ సంస్థల్లో 140 కోట్లు పెట్టుబడులు పెట్టిందని ఈడీ పేర్కొంది. ఆదిత్యనాథ్ దాస్ రూల్స్ కి వ్యతిరేకంగా పని చేసారని, ఒత్తిళ్ళకు లొంగి, నిబంధనలు పక్కన పెట్టి పని చేసారని, సిబిఐ కేసు ఫైల్ చేసింది. మరో పక్క, పోయిన వారం, పెన్నా సిమెంట్స్ కేసులో అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సిబిఐ. అయితే సిబిఐ ఈ కేసులో మళ్ళీ ఆక్టివేట్ అవ్వటం పై, జగన్ కేసుల్లో ఉన్న వారికి ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే ఆందోళన మొదలైంది.