ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని, అది తట్టుకోలేక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల ప్రసారాలను రాష్ట్రమంతా ఆపేసారని, దీనిని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై ఈ రోజు కోర్టు స్పందించింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్రాయ్, మాస్టర్ ఛానల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ డిజిటల్ నెటవర్క్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరికొంత మందికి నోటీసులు జారీ చేసింది. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల ప్రసారాలను ఎందుకు నిలిపివేసారో చెప్పాలని చెప్తూ, వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కె.వెంకటేష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున లాయర్ అంబటి సుధాకర్‌రావు వాదనలు విపించారు. ట్రాయ్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు, తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది.
గత పది రోజులుగా రాష్ట్రంలో, ఏబీఎన్ తో పాటు టీవీ5 ప్రసారాలు ఆపేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కధనాలు ఇస్తున్నారని, అందుకే ఆపేయాలని, కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వంలోని కొంత మంది మంత్రులు బెదిరించారు అంటూ, కధనాలు కూడా వచ్చాయి. కొంత మంది కేబుల్ ఆపరేటర్లు, ఇది చట్టానికి వ్యతిరేకం అని, ఫ్రీ ఛానెల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా పై ఉందని, ఇలా చెయ్యటం కుదరదు అని చెప్పిన సమయంలో, మంత్రులు మరింతగా బెదిరించి, మీరు మేము చెప్పినట్టు చెయ్యకపోతే, మీ ఏరియాలో ఇక నుంచి మీ కేబుల్ ప్రసారాల బదులు, ప్రభుత్వానికి చెందిన ఏపి ఫైబర్ నెట్ అందరి ఇళ్ళకు వస్తుందని, మేము చెప్పినట్టు వినాల్సిందే అని బెదిరించినట్టు కధనాలు వచ్చాయి.
అయితే మరో పక్క ఏపి ఫైబర్ నెట్ లో కూడా, ఏబీఎన్, టీవీ5 ప్రసారాలు ఆపేశారు. ముఖ్యంగా ప్రభుత్వంలోని లోటు పాట్లను ఈ ఛానెల్స్ ప్రసారం చేస్తూ ఉండటం, అవి ప్రజల్లోకి వెళ్తే, తమ బలహీనతలు అన్నీ బయట పడతాయి అని చెప్పి, ప్రభుత్వం ఈ పని చేసిందని ఆరోపిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ పెద్దలు ఆధ్వర్యంలో నడుస్తున్న సొంత టీవీ ఛానెల్ మాత్రం, ఎప్పటిలాగే తప్పుడు కధనాలతో ప్రతిపక్షాల పై విరుచుకు పడుతుంది. అలంటి తప్పుడు వార్తలు, సమాజంలో విషం చిమ్మే ఛానెల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు ఇలా ప్రభుత్వ పని తీరును ప్రశ్నించినందుకు, ఛానెల్స్ ను బ్యాన్ చెయ్యటం పై, ప్రజలు కూడా మండి పడుతున్నారు. వైఎస్ఆర్ లా ధైర్యంగా ఎదుర్కోవాల్సింది పోయి, ఇలా పిరికి తనంతో బ్యాన్ చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.