గోదవరిలో బోటు ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయ్యింది. ఇప్పటికీ ఇంకా కొన్ని మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. మృతదేహాలు వాటంతట అవి కొట్టుకుస్తుంటే, ఇప్పటి వరకు 33 మంది మృతదేహాలను కనుకున్నారు. ఇంకా 13 మృతదేహాల కోసం గాలింపు చేస్తున్నారు. అయితే అవి బోటులోనే ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది. మరో పక్క దాదపుగా నాలుగు రోజులు అవుతూ ఉండటంతో, మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా అయిపోతున్నాయి. మిగతా మృతదేహాలు కనుక తొందరగా దొరక్కపొతే, అవి గుర్తుపట్టలేని విధంగా అయిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ మృతదేహాలు బోటులోని ఏసి గదిలో చిక్కుకున్నాయా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఈపాటికే మృతదేహాలు పైకి తేలేయి. ఇప్పటికీ అవి కనిపించకపోవటంతో, బోటు తీస్తే కాని, ఆ మృతదేహాలు కనిపించే అవకాసం లేదని చెప్తున్నారు.
అయితే బోటు తీసే విషయంలో అధికారులు చేతులు ఎత్తేసారు. ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అంత కిందకు వెళ్లలేమని చేతులు ఎత్తేసారు. చివరకు నేవీ వాళ్ళు కూడా కుదరదని చెప్పేసారు. ముఖ్యంగా నౌకాదళానికి చెందిన ఉన్నతాధికారి దశరథ్ , ఇలాంటి ఘటనలలో బోటును వెలికి తియ్యటంలో అనుభవం ఉంది. ఆయన వస్తే, బోటు బయటకు వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. దీంతో దశరథ్ ను మంగళవారం రప్పించారు. ఆయన ప్రమాద ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితులు పరిశీలించారు. గోదావరి నదిలోకి 150 అడుగుల లోతు దాకా వెళ్లేందుకే తమకు అనుమతి ఉందని, అంతకుమించి కిందకు వెళ్ళలేమని ఆయన తేల్చి చెప్పారు.
ఇన్ని రోజులు గడిచిన తరువాత, అంత లోతులో ఎవరూ బ్రతికే అవకాసం ఉండదు కాబట్టి, సాహసం చేసేందుకు తమకు అనుమతులు ఉండవని ఆయన చెప్పారు. అయితే మరో పక్క, అధికారులు మరో పధ్ధతిలో బోటు తియ్యటానికి ప్రయత్నం చేసే విధానం గురించి ఆలోచించారు. కొన్నేళ్ల కిందట బలిమెల రిజర్వాయరులో భద్రతా బలగాలతో కూడిన బోటు మునిగిన సమయంలో బోటు ఎలా తీసామో, అలా తీద్దామని ప్రయత్నం చేసారు. కాని, ఇక్కడ పరిస్థితిలో అది కుదరదని, అంచనాకు వచ్చారు. అందుకే మృతదేహాలు వాటంతట అవి పైకి తేలితేనే అవి దొరికినట్టు అని, బోటులో కనుక ఉంటే, అవి తియ్యటం చాలా కష్టం అనే అంచనాకు అధికారులు వచ్చారు. అయితే ఇంకా మృతదేహాలు దొరకని బంధువుల ఇబ్బందులు మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయి. కనీసం మృతదేహాలు అయినా ఇవ్వమని కోరుతున్నారు.