రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా, వాటి నుంచి డైవర్ట్ చేయ్యతానికా అన్నట్టు, చంద్రబాబు ఉంటున్న ఇంటికి కూల్చేస్తాం అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తుంది. దీని పై, ఆ ఇంటి యజమాని, లింగమనేని రమేష్, జగన్ కు పూర్తీ వివరాలతో ఒక లేఖ రాసారు. తనను చంద్రబాబు బినామీగా పేర్కొంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని మానసిక వ్యథకు గురిచేస్తున్నారని ఆ లేఖలో వాపోయారు. ఇది పూర్తీ లేఖ. "ఈ రోజు ఉదయం నుంచి సీఆర్డీఏ అధికారులు ఉండవల్లి లోని మా ఇంటి వద్ద చేస్తున్న హడావిడి, అక్కడి నిర్మాణాలు కూల్చివేస్తారనే వార్తలు నన్ను ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నాయి. కృష్ణా నది కరకట్టపై మా కుటుంబానికి ఉన్న గృహం, నాడు ముఖ్యమంత్రి నివాసానికి ఇవ్వడం గురించి మీకు తెలియచేయాలి. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. విజయవాడ, కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నా ఇక్కడ నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేని పరిస్థితులు నెలకొన్నందున - కరకట్ట మీద ఉన్న మా అతిథి గృహాన్ని చూసి ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసానికి యోగ్యంగా ఉంటుందని అధికారులు భావించారు."
"ఆ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రిగారి కోసం ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించగానే మరో ఆలోచనకు తావు లేకుండా అంగీకారం తెలిపారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు గానీ ప్రతిపాదనలు గాని లేవు. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా స్పందించి - రాష్ట్ర పాలన బాధ్యతలు చూసే ముఖ్యమంత్రికి తగిన నివాసం ఇవ్వడం బాధ్యత గా భావించా. ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మరే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను అదే రీతిలో స్పందించేవాడిని. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివాసానికి నా ఇంటిని ఇచ్చిన కారణముగా నన్ను సదరు చంద్రబాబు నాయుడు గారికి బినామీ గా పేర్కొంటూ కట్టుకధలతో, అవాస్తవిక కధనాలతో రోజుకొక కధనాన్ని ప్రచురిస్తూ నన్నూ నా కుటుంబాన్ని మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. కరకట్టపైన ఉన్న నిర్మాణానికి అనుమతులు లేవు. కూల్చివేస్తాం అని సిఆర్టీ అధికారులు తాఖీదులు ఇస్తూ, పరిశీలనలు చేస్తున్నారు. వారికి ఇప్పటికే ఈ అంశంపై సమాధానం ఇచ్చాం. ఆ నిర్మాణానికి ఉండవల్లి గ్రామ పంచాయతీ నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొంది ఉన్నాం. ఇరిగేషన్ శాఖలోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ఎన్.ఓ.సి. కూడా తీసుకున్నాం."
"అప్పటికి అమలులో ఉన్న నిబంధనల మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న పిమ్మటే నదీ తీరాన యజ్ఞాలూ, పూజలూ వగైరా నిర్వహించుకోవడానికి అతిథి గృహాన్ని నిర్మించామని మీకు తెలియచేస్తున్నాను. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వానికి మా నుంచి సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తున్నాం. దివంగత శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రావాల్సిన పెట్టుబడులు, ప్రాజెక్టుల గురించి చర్చించడం జరిగింది. వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించేవారు. ఒక యువ పారిశ్రామికవేత్తగా ఎన్నో దేశాలు పర్యటించాను. ఇతర నగరాలకు దీటుగా మన విజయవాడ-గుంటూరు ప్రాంతం అద్భుతంగా ఎదగాలని కలలుగన్న వాడిలో నేనూ ఒకడిని. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ, ఎంతో రిస్క్ ఉన్న ప్రాజెక్ట్స్ చేపట్టి వాటిని విజయవంతంగా నడిపించే దిశగా వెళ్తున్న మా కుటుంబాన్ని - ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు బాధ కలిగిస్తున్నాయి. చివరిగా మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నది. 2014 వ సంవత్సరము తర్వాత నేను గానీ నా కుటుంబ సభ్యులు గానీ, నా సంస్థలు గానీ ఏ విధమైన కొత్త ప్రాజెక్టులు నిమిత్తం భూ సేకరణ గానీ, నిధుల సమీకరణ గానీ చేసియుండలేదు. ఈ రోజున నాకూ, నా కుటుంబ సభ్యులకు, నా సంస్థలకు ఉన్న ఆస్తులు అన్నియూ 2014 కంటే ముందుగానే సమకూరి యున్నవి. 2014 వ సంవత్సరము తర్వాత నేను అభివృద్ధి చెందినదిగానీ, లబ్ది పొందినదిగానీ, ఏ వ్యక్తి నుండి గానీ, ఏ సంస్థ నుండి గానీ, ఏ ప్రభుత్వము నుండి గానీ పొందియుండ లేదని తెలియజేస్తునాను."