ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తరువాత, మొదటి సారి ప్రజల్లోకి రానున్నారు. గత మూడు నెలల నుంచి జగన్ ప్రభుత్వ వైఫల్యాల పై ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, స్పందిస్తూ వచ్చారు. ముందుగా నిర్నయం తీసుకున్న ప్రకారం, జగన్ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలని, ఆ తరువాతే స్పందించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ మూడు నెలల్లోనే ప్రజలు జీవితాలు తారుమారు అయ్యి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లేక కూలీలు, విత్తనాలు లేక రైతులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క అన్న క్యాంటీన్ లు మూసివేతతో తిండి కూడా తినే పరిస్థితి పేద వాడికి లేకుండా పోయింది. ఇవన్నీ చూసిన చంద్రబాబు, మనసు మార్చుకున్నారు. ఇక ప్రభుత్వం పై క్షేత్ర స్థాయి పోరాటానికి సిద్ధం అయ్యారు.
ఇందు కోసం, వారానికి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటన చేయ్యనున్నారు చంద్రబాబు. ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. వినాయక చవతి పండుగ వెళ్ళిన తరువాత, సెప్టెంబర్ 5, 6 తేదీల్లో, కాకినాడ వేదిక చేసుకుని, రెండు రోజుల పాటు ప్రజా సమస్యల పై పోరాడనున్నారు. ప్రజల వద్దకు వెళ్లి, వాళ్ళ సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం చెయ్యనున్నారు. మరో పక్క, పార్టీ క్యాడర్ ను కూడా, బలోపేతం చెయ్యటం కోసం, ఈ పర్యటనలు వాడుకోనున్నారు. ఇప్పటికే వైసీపీ దాడులు తట్టుకోలేక, తెలుగుదేశం నేతలు గ్రామాలు విడిచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. వారికి ధైర్యం నింపి, పార్టీ అండగా ఉంటుంది అనే భరోసా ఇవ్వనున్నారు చంద్రబాబు.
పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించడంతోపాటు ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులతో భేటీలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు.వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కోసం, ప్రజలను, పార్టీని సమాయత్తం చెయ్యనున్నారు. అలాగే మొన్నటి వరకు అన్ని సీట్లు ఇచ్చిన గోదావారి జిల్లాల ప్రజలు, మొన్నటి ఎన్నికల్లో ఎందుకు తిరస్కరించారు అనే సమీక్ష కూడా చేసి, ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు చెయ్యనున్నారు. మొత్తంగా, ఇక నుంచి మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లి, ఎక్కడ కోల్పోయామో, అక్కడి తిరిగి సాధించేలా చంద్రబాబు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.