రాష్ట్రంలో బ‌హిరంగ‌స‌భ‌లు నిర్వ‌హించే ప్ర‌తిప‌క్షాలు క‌ట్ట‌డి చేసేందుకు తెచ్చిన జీవోని మ‌డిచి పెట్టుకోవాలంటూ టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సోష‌ల్మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. చంద్ర‌బాబు  ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ఇంటి మీదే దాడి చేసినా ఆయ‌న‌ని ఆప‌లేక‌పోయార‌న్నారు. తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌ల్ని దూరం చేయాల‌ని కేంద్ర కార్యాల‌యాన్ని ధ్వంసం చేయించార‌ని, అయినా తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యుల వెల్లువ‌ని అడ్డుకోలేక‌పోయాడ‌న్నారు. అక్ర‌మ‌ అరెస్టుల‌తో టిడిపిని భ‌య‌పెట్టాల‌ని చూసిన జ‌గ‌న్ రెడ్డి తెలుగుదేశం తెగువ చూసి వ‌ణికి చ‌స్తున్నాడన్నారు. వైసీపీపై తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త‌, తెలుగుదేశం పార్టీకి వెల్లువెత్తుతున్న ప్ర‌జాద‌ర‌ణ‌ని చూసి ఓర్వ‌లేక‌పోతున్న జ‌గ‌న్‌రెడ్డీ చీక‌టి జీవో తెచ్చార‌ని ఆరోపించారు. టిడిపి స‌భ‌ల‌కి వెళ్తే ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తామ‌ని బెదిరిస్తే మూల‌నున్న ముస‌ల‌మ్మ కూడా బెద‌ర‌డంలేద‌ని ఎద్దేవ చేశారు.  వైసీపీ రాక్ష‌స‌పాల‌న‌కి చ‌ర‌మ‌గీతం పాడేందుకు  రాయ‌ల‌సీమ స‌మ‌ర‌శంఖం పూరించింద‌ని, ఉత్త‌రాంధ్ర ఉప్పెన‌లా వైసీపీని ముంచెత్త‌నుంద‌ని, కోస్తా నీ స‌ర్కారుకి కొరివి పెట్ట‌నుంద‌ని హెచ్చ‌రించారు. చంద్ర‌బాబు స‌భ‌లు అడ్డుకోవాల‌నే కుతంత్ర‌మే కందుకూరు,గుంటూరు ఘ‌ట‌న‌ల‌ని స‌ర్కారు తెచ్చిన చీక‌టి జీవోయే చెబుతోంద‌న్నారు. అణ‌చివేత అధిక‌మైతే తిరుగుబాటు తీవ్రం అవుతుంద‌నే చారిత్ర‌క స‌త్యం  మ‌రిచిపోవ‌ద్ద‌ని, జీవోనీ మ‌డిచిపెట్టుకోవాల‌ని, జ‌న‌సునామీని ద‌మ్ముంటే త‌ట్టుకోవాల‌ని స‌వాల్ విసిరారు.

సభలు, ర్యాలీల నియంత్రణపై అర్ధరాత్రి ఇచ్చిన తుగ్లక్ జీవో నాలుక గీసుకోవటానికి కూడా పనికి రాదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ సభలు ఎక్కడ పెట్టాలో చెప్తున్నవారు, రేపు ఆ సభల్లో ఏం మాట్లాడాలో కూడా తాడేపల్లి స్క్రిప్ట్ రాసిస్తారా ? అని ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీ ఈ జీవోని చూసి వెన‌క్కి త‌గ్గ‌ద‌ని, యథావిథిగా సభలు, ర్యాలీలు నిర్వహించి తీరుతామ‌న్నారు. సభలు, ర్యాలీలు నియంత్రించాలని చూడటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రతిపక్షాలు కూటమి గా ఏర్పాటైన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను అడ్డుకునే చర్యలు న్యాయబద్ధంగానే ఎదుర్కొంటామ‌న్నారు. చీకటి జీవో అమలు చేయాలనుకునే అధికారులు నేటి సీఎం తూ.గో పర్యటనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బ‌హిరంగ‌స‌భ‌లు నిషేధించిన అధికారులు ఇవాళ రాజమహేంద్రవరం లో సీఎం రోడ్డు షోకు ఎలా అనుమతులిచ్చారని నిల‌దీశారు. తామనుకున్నట్లు చేయటానికి ఇదేం రాజారెడ్డి రాజ్యాంగం కాదన్నారు. ఒక పార్టీ గొంతు నొక్కటానికి అన్ని పార్టీల మెడకు ఉరి బిగిస్తున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త్వరలోనే అఖిలపక్షాలతో విశాఖ వేదికగా సమావేశం నిర్వహించి కార్యాచరణ వెల్లడిస్తామ‌న్నారు.

మాచర్ల టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట ల‌భించింది. మాచ‌ర్ల‌లో ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వైసీపీ టిడిపిపై దాడులు చేసింది. అయితే టిడిపి నేత‌ల‌పైనే పోలీసులు నాన్ బెయిల‌బుల్ కేసులు బ‌నాయించారు. వైసీపీపై బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారు. మార‌ణాయుధాల‌తో చ‌ల్లా మోహ‌న్ అనే వైసీపీ నేత బెదిరించిన వీడియో టిడిపి నేతలు బ‌య‌ట‌పెట్టినా పోలీసు చర్య‌లు శూన్యం. ఈ కేసుల్లో ముంద‌స్తు బెయిల్ కోసం మాచ‌ర్ల టిడిపి ఇన్చార్జి బ్ర‌హ్మారెడ్డి స‌హా నిందితులు ఆశ్ర‌యించారు. విచార‌ణ జ‌రిపిన హైకోర్టు గతంలో వాదనలు విని ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. A7 కళ్ళం రమణా రెడ్డికి తప్ప మిగిలిన టిడిపి నేతలకు  యాంటిసిపేట‌రీ బెయిల్ మంజూరు చేసిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే, దాని వెనుక చాలా పెద్ద వ్యూహ‌మే ఉంటుంద‌ని తేట‌తెల్ల‌మైంది అంటున్నారు టిడిపి నేతలు . ఒక కుక్క‌ని కొట్టాలంటే, ఆ కుక్క‌కి పిచ్చి ప‌ట్టింద‌ని ప్ర‌చారం చేయాల‌నే ఫ్యాక్ష‌న్ స్ట్రాట‌జీ అమ‌లు చేయ‌డంలో వైసీపీ ఆరితేరిపోయిందని, బాబాయ్ వివేకానంద‌రెడ్డిని చంప‌డానికి ముందు ఆయ‌న‌ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న కుక్క‌ని  చంపేశారని గుర్తు చేస్తున్నారు. ఇలా ఓ ఘోరం త‌ల‌పెట్ట‌డానికి ముందు చాలా నేరాల‌కు పాల్ప‌డ‌తారు. చంద్ర‌బాబు బ‌హిరంగ‌స‌భ‌లు, రోడ్‌షోలకి విశేష‌స్పంద‌న ల‌భిస్తుండ‌డంతో స్ట్రాట‌జీ అమ‌లు మొద‌లుపెట్టారని టిడిపి ఆరోపిస్తుంది. కందుకూరు, గుంటూరు స‌భ‌ల‌లో అమ‌లు చేశారని, అమాయ‌కుల్ని పొట్ట‌న‌బెట్టుకున్నారని, ఈ సంఘ‌ట‌న‌ల‌ను సాకుగా చూపుతూ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయించారనేది టిడిపి చేస్తున్న ఆరోపణ. చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలు జ‌ర‌గ‌కుండా  అడ్డుకోవ‌డానికే ఈ నిర్ణ‌యం అని అంద‌రికీ తెలుసు. ప్ర‌భుత్వం ఏమి చేయాల‌నుకుంటుందో ఆ సంఘ‌ట‌న‌లు త‌రువాత మంత్రులు, మాజీ మంత్రుల నోట వెంట ప‌లికించింది. అనంత‌రం జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతి రద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని నిబంధన విధించారు. కందుకూరు, గుంటూరు స‌భ‌లు అధికారులు అనుమ‌తించిన ప్ర‌దేశంలోనే జ‌రిగాయి. భ‌ద్ర‌తాచ‌ర్య‌లు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించ‌డంతో ఇక్క‌డ తొక్కిస‌లాట‌లు జ‌రిగాయో, జ‌రిపించారో అనే అనుమానాలు ఉన్నాయి. చంద్ర‌బాబు స‌భ‌లకు పోటెత్తుతున్న జ‌న‌సంద్రాన్ని అడ్డుకునే మార్గాల‌న్నీ విఫ‌లం కావ‌డంతో కందుకూరు, గుంటూరు ఘ‌ట‌న‌లు సాకుగా చూపి ఆయ‌న స‌భ‌లు జ‌ర‌ప‌కుండా ఉండేందుకే ఈ నిషేధం అమ‌లులోకి తెచ్చారని టిడిపి ఆరోపణ

Advertisements

Latest Articles

Most Read