నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారా ? అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఇటీవల వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి నివాసంకి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పాత కేసులు బయటికి తీస్తామని బెదిరించి వుంటారని నెల్లూరు టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎంని కలిసి వచ్చిన తరువాత కోటంరెడ్డి వాయిస్‌లో తేడా దీనికి నిదర్శనం అంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎంకి వివరణ ఇచ్చానని తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి జగన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కొందరు అధికారులు సహకరించలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రభుత్వంపై వివాదాస్పదంగా తాను మాట్లాడలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతున్నానని, దీనిని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు. అనారోగ్య సమస్యల వల్లే గడప గడపకీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వివరణ ఇవ్వడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
news
వైసీపీ కుట్ర అనే టిడిపి ఆరోపణలు, నిజం చేస్తున్న కొడాలి నాని మాటలు...
అంతా అనుమానిస్తున్న కోణమే బయటపడింది. చంద్రబాబు బహిరంగసభలకు హాజరు కాకుండా వైసీపీ పెద్దలు కుట్ర పన్నారనే అనుమానాలను కొడాలి నాని ప్రకటన బలపడేలా చేసింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా, ఎంత మారుమూల ప్రదేశంలోనైనా చంద్రబాబు సభ ఉందంటే చాలు. జనం పోటెత్తుతున్నారు. చంద్రబాబు సభకి వెళ్తే పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. అయినా జనసునామీని ఆపడం వైసీపీకి సాధ్యంకావడంలేదు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని రక్షించగలడు అని జనం ఫిక్సయ్యాక, రోజురోజుకీ జనాదరణ పెరుగుతూనే ఉంది. టిడిపికి ఒక సర్పంచ్ కూడా లేని ప్రాంతలోనూ ప్రజలు ప్రభంజనమై వస్తున్నారు. అనుమతి నిరాకరించడం, జనాన్ని అడ్డుకోవడం వంటి పాతకాలపు రాజనాల సినిమా టైపు కుట్రలన్నీ అమలుచేసి అలిసిపోయారు వైసీపీ నేతలు. ఈ సందర్భంలోనే కందుకూరులో మొదలై, గుంటూరులో వరుస ప్రమాదాలు జరిగాయి. అసలు ఏం జరుగుతుంది అని టిడిపి ఆలోచించే లోపే వైసీపీ విష ప్రచారం మొదలు పెట్టింది. 40 ఏళ్లుగా లక్షల మంది సభలలో పాల్గొన్న చంద్రబాబు, టిడిపికి తెరవెనుక ఏదో జరుగుతోందని డౌట్ వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సభ ఏదైనా జరపాలి అంటే ప్రభుత్వం అనుమతి కావాలి. ప్రభుత్వం అంటే జగన్, ఆయన పోలీసులు. చంద్రబాబు సభలకు అనుమతి ఇచ్చి భద్రతా ఏర్పాట్లు పరిశీలించింది పోలీసులే. పోలీసుల వైఫల్యం, సర్కారు కుట్రతోనే సభలో విషాదాలు జరిగాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం నుంచి మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటన ఉంది. చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదని కొడాలి నాని డిమాండ్ చేస్తున్నారు. అంటే భద్రత కల్పించనిదీ ప్రభుత్వమే, తొక్కిసలాటకి కారణమూ ప్రభుత్వం కనుసన్నల్లోని పోలీసులే. వారి వైఫల్యాన్ని అంగీకరించకుండా చంద్రబాబు సభలకు పర్మిషన్ ఇవ్వొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి కొడాలి నాని డిమాండ్ చేస్తున్నారు. పోయిన ప్రజల ప్రాణాల పట్ల వీరికి బాధ్యతలేదు. జగన్ పట్ల వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో జనం చంద్రబాబు సభలకు వెళ్లకూడదనే లక్ష్యమే వైసీపీలో కనిపిస్తోంది. అంటే కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక పెద్ద స్కెచ్చే ఉందని సామాన్యులకు సైతం అర్థం అవుతోంది.
ఉత్తరాంధ్రపై నెల్లూరు సాయిరెడ్డి, ప్రకాశం సుబ్బారెడ్డి పెత్తనాన్ని మంత్రి ధర్మాన ఎందుకు ప్రశ్నించరు ?
గత కొద్దిరోజులుగా మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఉత్తరాంధ్రపై ఎక్కడలేని ప్రేమ తన్నుకొస్తోంది. ఉత్తరాంద్ర కోసం ఉద్యమిస్తున్నారు. వైసీపీ పెద్దతలకాయల దృష్టిలో ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కాదండోయ్. ఓన్లీ విశాఖ. దానిచుట్టూ వున్న భూములపైనే ఈ ప్రేమ అనేది అందరికీ అనేది టిడిపి వాదన కూడా. ఇప్పుడు ఉత్తరాంధ్రని రాష్ట్రం చేయాలని అడగకుండా, విశాఖని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటున్నాడు ధర్మాన. సరే గోదావరి, కృష్నా, గుంటూరు, రాయలసీమ రాజకీయ పార్టీల పెత్తనంలో ఉత్తరాంధ్ర ఉండ కూడదనుకుంటే, మూడు జిల్లాలని కాకుండా విశాఖ ఒక్కదాన్నే ప్రత్యేక రాష్ట్రం అడగడంలో ఏంటి మతలబు అనేది చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు విశాఖతోపాటు ఉత్తరాంద్ర మూడు జిల్లాలపై మొన్నటివరకూ నెల్లూరు జిల్లాకి చెందిన విజయసాయిరెడ్డి పెత్తనం సాగేది. ఇప్పుడు ప్రకాశం జిల్లాకి చెందిన వైవీ సుబ్బారెడ్డి పెత్తనం సాగుతోంది. వీరి ఆజ్ఞలేనిదే ఫ్యాక్టరీలలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా వేయించుకోలేనంత అశక్తులైపోయారు ఉత్తరాంధ్ర మంత్రులు, వైసీపీ నేతలు. మా ఉత్తరాంధ్రపై నెల్లూరు రెడ్డి, ప్రకాశం రెడ్డి పెత్తనం ఏంటి అని మంత్రి ధర్మానకి దమ్ముంటే ప్రశ్నించాలని టిడిపి నేతలు సవాల్ విసురుతున్నారు. పరాయి జిల్లాలకు చెందిన రెడ్లకు ఉత్తరాంధ్రని ధారాదత్తం చేసి, ఉత్తరాంధ్ర కోసం ఉద్యమం అంటే ఎవరైనా నమ్ముతారా ధర్మానా?
పోలీసులు చింపిన చొక్కాతో, చింతమనేని మాస్ ప్రెస్ మీట్...
నా వంటిపై బట్టలు చించిన పోలీసులకు రేపు ఒంటిపై బట్టలు ఉంటాయా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రేపు నా పుట్టిన రోజు సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం నేను చేసిన తప్పా అని ప్రశ్నించారు. హరిరామ జోగయ్య అదే ఆసుపత్రి వద్ద ఉన్నారనే వంకతో నా కార్యక్రమాన్ని అడ్డుకుని, తన పైన దాడి చేశారని ఆరోపించారు. ఇప్పటికే నాపై 31కేసులు పెట్టారు, నేను అన్నింటికీ తెగించి ఉన్నానన్నారు. జగన్మోహన్ రెడ్డి తాత దిగొచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. నా చొక్కా చించిన పోలీసులని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. చినిగిన చొక్కాతో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు చింతమనేని. ఏం తప్పు చేశానని తన చొక్కా చించారని ప్రశ్నించారు. డీఎస్పీ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే తనపై 31 కేసులు పెట్టారని, దేనికీ భయపడేది లేదన్నారు. అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు.