రాష్ట్రంలో ఎన్నో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ విధానాలు, పోలీసుల వైఖరిని బట్టి అవి తగ్గటమో, పెరగటమో జరుగుతాయి. పూర్తిగా తగ్గించటం ఎవరి తరమూ కాదు. మన రాష్ట్రంలో కూడా క్రైమ్స్ తక్కువ ఏమి జరగవ్.. ప్రభుత్వం మారటంతో, గత నెల రోజులుగా రాజకీయ దాడులు గురించి వింటూ వస్తున్నాం, అయితే ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం, అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మనం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వెరైటీగా కొన్ని న్యూస్ చూస్తూ ఉంటాం. దొంగలు ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్ళిపోయారని. ఎక్కువగా ఇవి, విదేశాల్లో జరుగుతూ ఉంటాయి. మన దేశంలో ఎప్పుడైనా ఇలాంటివి వింటూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం, ఇలాంటి న్యూస్ లు ఇప్పటి వరకు వినింది లేదేమో. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఏటీఎంని ఎత్తుకుపోయిన దొంగలు అనే వార్త వినాల్సి వచ్చింది. ఇలాంటి దొంగతనం వార్త విని, అటు పోలీసులు, ఇటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. దొంగలు ఇంత అడ్వాన్స్ గా ఉన్నారా, ఇన్ని రూపాల్లో దొంగతనం చెయ్యటానికి వస్తున్నారా అని తెలుసుకుని, అవాక్కవటం పోలీసుల వంతు అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని, ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ ఆనుకుని ఒక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఏటీఎం ఉంది. అయితే శనివారం వచ్చి చూసిన వారికి అక్కడ ఏటిఎం మిస్ అయ్యింది. ఏటిఎంలో డబ్బులు లేకపోవటం చూసాం కాని, ఇలా ఏకంగా ఏటిఎం లేకపోవటం ఏంటా అని ప్రజలు అనుకున్నారు. కాని చివరకు అక్కడ పరిస్థితి చూసి, దొంగలు ఏటిఎంని ఎత్తేసారని తెలుసుకుని, పోలీసులకు, బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసారు. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అధికారులు చెప్పిన దాని ప్రకారం, చోరీ జరిగే సమయానికి ఏటీఎం మిషన్‌లో రూ.8.23 లక్షల ఉన్నట్లు చెప్తున్నారు. మరో పక్క ఏటీఎం మిషన్ ఖరీదు దాదపుగా రూ.4 లక్షలు చేస్తుందని అధికారులు అంటున్నారు. అయితే ఏకంగా పోలీసు క్వార్టర్లకు ఆనుకునే ఉన్న ఏటిఎం ను ఎత్తుకుపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాదాపు 700 కిలోల బరువుండే ఏటీఎం మిషన్ ఎలా ఎత్తుకుపోయారో అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.