ఎన్నికల్లో ఓడిపోయిన మొదలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రతి రోజు ఎదో ఒక అవమానం, హేళన, కక్ష సాధింపు సర్వ సాధారణం అయిపోయాయి. దేశంలోనే అతి కొద్ది మందిలో ఉండే జెడ్ + క్యాటగిరీ భద్రతలో ఉండే చంద్రబాబుకు, జగన్ ప్రభుత్వం పైలట్ వాహనం తీసేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఎలాంటి భద్రతా పరమైన ఇబ్బందులు వస్తాయో తెలిసినా, ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబుని చెక్ చెయ్యటం గురించి రచ్చ అయ్యింది. అయితే ఈ విషయం పై చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. కాని అక్కడ నుంచి ప్రత్యెక వాహనం లేకుండా, మిగతా ప్రజలతో ఒకే బస్సులో ఫ్లైట్ వరకు తీసుకు వెళ్ళటం మాత్రం అభ్యంతరం చెప్పే విషయం. ఇక అసెంబ్లీలో చంద్రబాబుని ఎలా హేళన చేసారో, చూసాం. టిఎంసీ అంటే తెలియని వాడు కూడా, ఆయనకు ఇరిగేషన్ పాఠాలు చెప్పే వారే. అవినీతి చేసే వారు, ఆయనకు అవినీతి గురించి పాఠాలు చెప్పే వారే. ప్రజా తీర్పును శిరసావహిస్తూ, మౌనంగా ఉంటూ, అన్నీ భరించటం తప్ప, చేసేది ఏమి లేదు.

ఇక నిన్న జగన్ తీసుకున్న నిర్ణయం అయితే తమిళనాడు కక్ష పూరిత రాజకీయాలను గుర్తు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను అక్రమ కట్టడం అంటూ దాన్ని కూల్చి వేయాలని జగన్ ఆదేశించారు. అయితే ప్రభుత్వ కట్టడాన్ని కూల్చివేయటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇది కేవలం కక్ష సాధింపు వ్యవహరామే అని అంటున్నారు. ఇక ఈ రోజు, ఏపి ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి, చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరికీ భద్రత తీసివేసింది. ఈ రోజు విదేశాల నుంచి చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ లో అడుగు పెట్టగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లోకేష్ కు ఉన్న జెడ్ క్యాటగిరీ భద్రత తొలగించి, సాధారణంగా అందరికీ ఇచ్చినట్టు 2+2 ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులకు పూర్తిగా తొలగించారు. అయితే ఈ విషయం పై టిడిపి శ్రేణులు ఆందోళన్ చెందుతున్నాయి. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా చెయ్యటం దారుణం అని అంటున్నారు. గతంలో మేము అధికారంలో ఉండగా, రాజకీయాలు ఎన్ని ఉన్నా, భద్రత విషయంలో మాత్రం, జగన్ కు ఆయన కుటుంబానికి ఎప్పుడూ ఇలా చెయ్యలేదని తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు.

ఉండవల్లి దగ్గర చంద్రబాబు ప్రభుత్వ హయాంలో, ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చిపడేయాని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. అది అక్రమ కట్టడమని, అవినీతి డబ్బులతో కట్టిన కట్టడమని ఆరోపించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టిన భవనం, అవినీతి కట్టడం ఎలా అవుతుందో జగన్ కే తెలియాలి. అయితే జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ కూల్చివేత నిర్ణయం పై, చాలా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మీద ఉన్న కక్షతో, ప్రభుత్వ బిల్డింగ్ కూల్చివేయటం దారుణమని అంటున్నారు. ఇదే విషయం పై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఫేస్బుక్ లో స్పందించారు. మొన్నటి దాక, తెలుగుదేశంలోని కొంత మంది నేతలను, తన అసంతృప్తిని పోస్ట్ చేస్తూ, వార్తల్లో నిలిచిన నాని, ఇప్పుడు జగన్ చేసిన పనిని టార్గెట్ చేస్తూ, ప్రజా వేదిక కూల్చివేత పై పోస్ట్ పెట్టారు. ప్రజా వేదిక తొలగిస్తే, దానికి రెండు రకాల ఇబ్బందులు వస్తాయని, అవి తెలుసుకుని ముందుకు వెళ్ళాలని నాని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు.

ఇది కేశినేని నాని చేసిన ఫేస్బుక్ పోస్ట్ ‘‘ప్రజావేదిక అక్రమ కట్టడమో, సక్రమ కట్టడమోపక్కన పెడితే, అది ప్రజా ధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనం. ప్రజావేదిక అక్రమ కట్టడం అని తొలగించె ముందు, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలన్నీ ముందుగా తొలగించి, తరువాత ప్రజా వేదిక ను చివర్లో తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రజా వేదికను ఉన్న పళంగా తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి, అది ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చి వేస్తే, దాని నిర్మాణానికి పెట్టిన ఖర్చు వృథా అవుతుంది. రెండోది, ప్రస్తుతం అంత పెద్ద హాల్ ప్రభుత్వానికి లేదు. ఇలాంటి మరో వేదిక కట్టాలంటే టైం పడుతుంది. అప్పటి వరకు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించాలి అంటే, ప్రైవేటు వేదికలకు డబ్బు ఖర్చు పెట్టాలి. ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈలోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ప్రజావేదిక తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని కేశినేని పోస్ట్ చేసారు.

జనసేన పార్టీ రాబోయే కాలంల్లో, ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. 2019లో ఎన్నికల ఫలితాల్లో కేవలం ఒక్క సీటులో గెలిచిన తరువాత,పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్ళాలి అని విషయం పై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకు సంబంధించిన వివిధ కమిటీలు ఏర్పాటు చేసి, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కసరత్తు ప్రారంభించారు. ఇదే విషయం పై ఈ రోజు పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో పవన్ సమావేశం అయ్యారు. దీని పై చర్చించిన తరువాత, పవన్ కళ్యాణ్ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియాతో మాట్లడారు. జనసేన పార్టీ ముఖ్యమైన కమిటీల ఏర్పాటు పై ప్రకటన చేసారు. ప్రస్తుతం 18 నుంచి 20 కమిటీలు వేస్తున్నట్లు ప్రకటన చసారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా పార్టీ కోసం శ్రమించి, పార్టీని ముందుకు తీసుకువెళ్తామని, ప్రజల సమస్యల పై పోరాడతామని చెప్పారు.

ఇక ప్రస్తుతం, రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన ప్రజా వేదిక కూల్చటం పై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. అక్రమకట్టడాలైతే ప్రజావేదికతో పాటు, కృష్ణా తీరం వెంట ఉన్న అన్ని అక్రమ కట్టడాలు కూల్చేయాలని జనసేన అధినేత అన్నారు. ఎదో ఒక బిల్డింగ్ కూల్చేసి, ఊరుకుంటాం అంటే అది కక్ష సాధింపు అవుతుందని, ఎలాగూ కూల్చటం మొదలు పెడుతున్నారు కాబట్టి, అన్నీ కూల్చేయాలి అని అన్నారు. మరో పక్క పార్టీ ఫిరాయింపుల పై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. సొంత ప్రయోజనాల కోసమే నేతలు పార్టీలు మారుతున్నారని అన్నారు. జనసేన పార్టీ నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్లడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఫిరాయింపులకు మా పార్టీ వ్యతిరేకమని అన్నారు. మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే నేతలను ఆహ్వానిస్తామని అన్నారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తే స్వాగతిస్తామని అన్నారు. వెంటనే జగన్ ప్రభుత్వం పై విమర్శలు చెయ్యమని, వారి విధానాలు ఏమిటో చూస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ కమిటీల గురించి ప్రస్తావిస్తూ, వివధ ప్రశ్నలకు స్పందించారు. ఈ సందర్భంలో ప్రత్యెక హోదా పై స్పందిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రజల్లో, ప్రత్యెక రాష్ట్రం సాధించుకోవాలనే తపన, కసి, వారికీ ఉన్న ఆకాంక్ష, కోపం, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రా ప్రజలకు ఉందా లేదా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఏపి ప్రజల్లో ఆ కసి లేదా అని ఒక్కోసారి తనకు సందేహం కలుగుతోందని పవన్ అన్నారు. ప్రజల్లో ఆ ఆకాంక్ష, కసి, నిరాసన రానంతవరకు, తాము ఎంత గట్టి పోరాటం చేసినా ప్రయోజనం ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే జగన్ పాలన పై స్పందిస్తూ, ప్రజలకు ఉపయోగపడే పథకాలు తెస్తే స్వాగతిస్తామని, కాని తప్పు చేస్తే వదిలిపెట్టమని, ప్రజల తరుపున పోరాటం చేస్తామని అన్నారు. ఓడిపోయాం కదా అని, వెనక్కు తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పారు.

హైదరాబాద్‌ లోని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేచెందిన భవనాలను, చెప్పా పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పై పవన్ స్పందించారు. ఈ విషయం పై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని, ఎవరికీ చెప్పకుండా ఇలా చేస్తే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం ఉండదని అన్నారు. రాబోయే 30 రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి బాధ్యతలు అప్పగించి, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయ, ఈ అంశాల పై జగన్, కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయో చూస్తామని, అప్పుడు స్పందిస్తామని పవన్ అన్నారు. జనసేన పార్టీ అన్ని వేళల్లో ప్రజలకు అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారు, మేధావుల సలహాలు తీసుకుని, పార్టీని ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read