ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. స్పీకర్ చైర్ వరకు ప్రతిపక్షనేత చంద్రబాబు రాకుండా బంట్రోతును పంపారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభలో అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా చెవిరెడ్డి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. బంట్రోతుల్లా.. అనే పదం వాడారని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షనేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై మాకు ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. తనను పిలవకుండానే స్పీకర్ చైర్ స్థానం వరకు ఎలా వస్తాను? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. "నన్ను పిలవలేదు.. రికార్డులు చూడండి. స్పీకర్‌కు అభినందనలు తెలిపేందుకు అచ్చెన్నాయుడును పంపిస్తే బంట్రోతు అంటూ అహంభావంతో మాట్లాడుతున్నారు. అహంభావంతో వ్యాఖ్యలు చేసినవారు క్షమాపణలు చెప్పాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపడుతుండగా.. వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.
తాము బంట్రోతులమని మాట్లాడుతూ అధికారపార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సభలో అవమానపరిచారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆ మాటలు అన్నందుకు సభలో ఆయన క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రికార్డులు చేసి .. ఆ వ్యాఖ్యలు ఉంటే తొలగిస్తానని అన్నారు. సభాపతి వ్యాఖ్యలపై సంతృప్తి చెందని అచ్చెన్నాయుడు.. తాము ప్రజాప్రతినిధులమా లేక బంట్రోతులమా? అన్నది స్పీకర్ చెప్పాలన్నారు. తాము చంద్రబాబుకు బంట్రోతులమైతే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెలు జగన్‌కు బంట్రోతులని వారు ఒప్పుకుంటే తాము కూడా చంద్రబాబు బంట్రోతులమని ఒప్పుకుంటామని అచ్చెన్నాయుడు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో చంద్రబాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని రాద్దాంతం చేయదలచుకోలేదని, స్పీకరే ఒక నిర్ణయానికి రావాలని కోరారు. దీనిపై సభాపతి మాట్లాడుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రికార్డులు చూసి.. ఆ వ్యాఖ్యాలను రికార్డుల నుంచి తొలగించి, ఏం చేయాలన్నదానిపై చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.