ప్రభుత్వ విప్ పదవిని పార్థసారథి తిరస్కరించారు. దీంతో మరొకరికి అవకాశం ఇచ్చారు. అయితే పదవి ఎందుకు తిరస్కరించారో తెలియాల్సి ఉంది. డిప్యూటీ సియం పదవి ఇస్తున్నారు అంటూ, హడావిడి చేసి, చివరికు ఏ మంత్రి పదవి ఇవ్వకుండా, విప్ పదవి ఇచ్చినందుకు అసంతృప్తి చెందారా అనేది తెలియాల్సి ఉంది. పార్ధసారధి విప్ పదవి తిరస్కరించటంతో, కొత్తగా మరో ముగ్గురికి విప్ పదవులు వరించాయి. ప్రభుత్వ చీఫ్ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. విప్‌లుగా బుడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఐదురోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల కోసం ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా... మొదటిసారిగా సీఎం హోదాలో జగన్ అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. సభలో సీఎం జగన్, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, అనంతరం శాసన సభ్యులతో ప్రొటెం స్పీకర్ శంబంగి చినవెంకట అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కార్యాలయాలు కేటాయించింది. గతంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు ఇచ్చిన చాంబర్‌ను చంద్రబాబుకి కేటాయించగా, లోకేష్ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు. గత సభలో వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయం, తెలుగుదేశం శాసనసభ పక్ష కార్యాలయం, ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌కు కేటాయించిన చాంబర్లను వైసీపీ తీసుకుంది. గురువారం స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను అధికారికంగా ఎన్నుకొనున్నారు శాసన సభ సభ్యులు. ఈ నెల 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు.ఈ నెల 15,16 తేదీల్లో సభకు సెలవు ప్రకటిస్తారు. 17,18 న అసెంబ్లీ. సెషన్స్ నిర్వహించి ఈ నెల 18 తో ముగించనున్నారు.