నిన్న వెలువడిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ స్పందించారు. తెలంగాణ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని ప్రకటించారు. ఇందుకు కారణాలు ఏమైనా సరే వరుసగా రెండు సార్లు విఫలమయ్యానని, ఇకపై భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సంచలన ప్రకటన చేశారు. 2014 లో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఎంపీ పదవికి రాజీనామా చేశానని, ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నానని తెలిపారు.
అప్పటి నుంచి తాను ఏ పార్టీకీ అనుబంధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. 2004 నుంచి సర్వేలు తనకు ఒక వ్యాపకంగా మారాయని, ప్రజల నాడి ఎవరికి అనుకూలమైనా, వ్యతిరేకమైనా కూడా పక్షపాతం లేకుండా చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కోవలోనే ఏపీ, తెలంగాణలో కూడా మీడియా ద్వారా సర్వే వివరాలను ప్రజలకు వివరించానని అన్నారు. తన ఫలితాల వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నించమని కోరుతున్నానని తెలిపారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్ కి శుభాకాంక్షలు చెప్పిన లగడపాటి చంద్రబాబు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని రాష్ట్రాభివృద్దికి సహకరించాలని కోరారు.