ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం లొంగిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఈసీ పనితీరు భేష్ అంటూ ప్రశంసించారు. దీంతో ఈరోజు ప్రణబ్ ముఖర్జీ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై వస్తున్న ఆరోపణలపై తాను ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించారు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పవిత్రమైందని.. ఎటువంటి అనుమానాలు లేకుండా చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈవీంలపై వస్తున్న ఆరోపణలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పవిత్రమైందన్న ఆయన ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.
అదేవిధంగా 'ఓటర్ల తీర్పును ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై నాకు ఆందోళన కలిగింది. ఈసీఐ అధీనంలో ఉన్న ఈవీఎంల రక్షణ, భద్రత మొత్తం ఎన్నికల సంఘానిదే. ప్రజాస్వామ్య మూలాలను సవాలు చేసేలా ఊహాగానాలు రావడం సరికాదు. ప్రజల తీర్పు చాలా ఉన్నతమైనది. వారికి సంబంధించిన అన్ని అనుమానాలకు తీర్చాలి. మన వ్యవస్థలపై దృఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. మన వ్యవస్థల సమగ్రత బాధ్యత ఎన్నికల సంఘంపై ఆధారపడి ఉంది. ఎటువంటి ఊహాగానాలు లేకుండా చేయాల్సి ఉంది' అంటూ ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
కాగా, ఈనెల 19న లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకూ ఎన్నికల కమిషన్ తన స్వయంప్రతిపత్తికి తిలోదకాలిచ్చి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందంటూ విపక్షాలు ఈసీని తప్పుపట్టాయి. ప్రధాని మోదీకి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఇచ్చిన వరుస క్లీన్ చీట్లపైనా ఈసీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మోదీ, అమిత్‌షాలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై తన అసమ్మతిని రికార్డు చేయనందునే కమిషన్ మీటింగ్‌లను తాను బహిష్కరించినట్టు ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అశోక్ లవాసా అభిప్రాయపడటాన్ని కూడా విపక్షాలు తవ వాదనకు బలం చేకూర్చినట్టు క్లెయిమ్ చేసుకున్నాయి.