మాజీ ప్రధాన మంత్రి మరియు జెడిఎస్ అధినేత హెచ్.డి. దేవెగౌడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంకీర్ణ భాగస్వామిగా ఉన్నామని , లోక్ సభ ఎన్నికలను తన మిత్రపక్షంతో కలిసి పోరాడినట్లు దేవె గౌడ తెలిపారు . బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని అధికారంనుండి దించటానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా ఆయన స్వాగతిస్తామని తెలిపారు. దేవెగౌడ తన 85 వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే 23న కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ సమావేశానికి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని దేవెగౌడ తెలిపారు. ఒకవేళ అలాంటి సమావేశం ఉంటె అధికారిక ఆహ్వానం లేకపోయినా సమావేశంలో హాజరవుతానని ఆయన పేర్కొన్నారు.

dwagowda 18052019

అన్ని పక్షాలను, ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం సోనియా గాంధీ యొక్క "రాజకీయ పరిపక్వత" కు సాక్ష్యం అని ఆయన అభిప్రాయపడ్డారు . కేంద్రంలో ఎన్డీయే విఫలం అయితే ఎవరు ప్రధాని కావాలి అన్న అంశంపై మాట్లాడిన ఆయన ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వకుండా ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఇక బీజేపీయేతర కూటమిలోనూ చాలా ప్రాంతీయ పార్టీలున్నాయి. వాటిన్నటి మధ్య ముందు ఏకాభిప్రాయం రావాలి. మే 23 న సమావేశం జరిగితే సోనియా గాంధీకి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను అని దేవెగౌడ పేర్కొన్నారు.

dwagowda 18052019

ప్రధాని నరేంద్రమోడీని ఓడించాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమవుతున్న తరుణంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది . మరి కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయి. ఇక ఈ నేపధ్యంలో బీజేపీ ని గద్దె దించటానికి అన్ని పార్టీలు ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం వుంది. సోనియా సమావేశం అందుకు వేదిక అవుతుంది అని దేవెగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు . మొత్తానికి ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో స్టాలిన్ వెళ్లి అడిగితే షాకిస్తే, దేవెగౌడ మద్దతు అడగకముందే తమ మద్దతు ఎవరికో చెప్పి షాక్ ఇచ్చారు. అయితే వారం క్రితం, కేసీఆర్ కర్ణాటక వెళ్తారని, అక్కడ కుమారస్వామిని కలిసి, ఫెడరల్ ఫ్రంట్ కోసం మద్దతు అడుగుతారనే వార్తలు వచ్చాయి. ఎందుకో కాని కేసీఆర్ అటు వెళ్ళలేదు, ఇప్పుడు దేవగౌడ వ్యాఖ్యలు విన్న తరువాత వెళ్ళే అవసరం కూడా లేదు.

తుదిదశ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని తాజాగా ఆదేశించింది. రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు, కాలూరులో ఆదివారం రీపోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఇటీవలే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసీ తాజా నిర్ణయంతో రేపు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది.

ec repolling 18052019

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరిగితే ...34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలివ్వడమేంటని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనచేస్తున్నారు. ఈక్రమంలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు రావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే, అసలు రేపు పోలింగ్ అంటూ, కనీసం 24 గంటల టైం కూడా ఇవ్వకుండా, ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇస్తే, ప్రజలకు ఎలా తెలుస్తుంది, అధికారులు ఎలా ఏర్పాట్లు చేస్తారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈసీ ధోరణి చూస్తుంటే, కౌంటింగ్ అయిన తరువాత కూడా, రీ పోలింగ్ పెట్టినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

టీవీ9 షేర్ల వ్యవహారంలో మాజీ సీఈఓ రవిప్రకాశ్ తో పాటు ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు హీరో శివాజీ. తాజాగా వీరిద్దరిపై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు వార్తలొస్తున్నాయి. వీరిరువురిపై అలంద మీడియా ఫిర్యాదు చేసినప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. గత కొన్నిరోజులుగా రవిప్రకాశ్, శివాజీ ఆచూకీ తెలియకపోవడంతో వీరిద్దరూ ఫలానా ప్రాంతాల్లో తలదాచుకుని ఉండొచ్చంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో శివాజీ ఓ వీడియో ద్వారా తెరపైకి వచ్చారు. శివాజీ ఎక్కడికీ పారిపోలేదని, శివాజీ వెన్నుచూపే వ్యక్తికాదని ఆ వీడియోలో వివరించారు. "శివాజీ పారిపోయాడు" అని ప్రచారం చేసే మీడియాలోని ఓ వర్గం కోసం ఈ వీడియో రూపొందించలేదని, తన బాణీ వినపించడానికే రూపొందించానని తెలిపారు.

sivaji 18052019

"ఇది రవిప్రకాశ్ కు నాకూ మధ్య ఉన్న విషయం. షేర్ల విషయంలో ఉన్న పంచాయితీ ఇది. ఈ సివిల్ పంచాయితీని కాస్తా క్రిమినల్ వ్యవహారంగా మార్చడానికి మధ్యలో ఈమెయిల్స్ తీసుకొచ్చారు. డిలీట్ చేసిన ఈమెయిల్స్ రికవర్ చేసినవాళ్లకు అందులో లేని పదాలను యాడ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇదో కుట్ర. 2018 ఫిబ్రవరిలో నాకూ రవిప్రకాశ్ కు మధ్య అగ్రిమెంట్ జరిగింది. అదే ఒప్పందాన్ని ఇటీవలే తిరగరాసుకున్నాం. ఇది సాధారణమైన విషయమే. సంస్థలోకి కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు నా ప్రయోజనాలను కాపాడుకునేందుకు నేను ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఈ విషయంలో ఏదో జరిగిపోతోందని చెబుతూ కౌశిక్ రావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాళ్లు మా ఇంటి మీద పడిపోయి మావాళ్లందరినీ సోఫాల్లో కూర్చోబెట్టి ఇల్లంతా వెదికి ఏమీ దొరకలేదని సంతకం పెట్టించుకుని వెళ్లిపోవడం.. ఏమిటిదంతా!" అంటూ మండిపడ్డారు. తాము సెటిలర్లం కాబట్టి, తమకు స్థానబలం లేదని తమపై హైదరాబాదు పోలీసులు కేసులు పెట్టి లోపల వేసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

sivaji 18052019

అయినా తాను భయపడి పారిపోవడానికి ఇదేమైనా పెద్ద కేసా? అంటూ శివాజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు 100 వేసుకున్నా ధైర్యంగా ఎదుర్కొంటానని, అయితే అనారోగ్యం కారణంగానే విశ్రాంతి తీసుకుంటున్నాను తప్ప ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ఈ కొన్నిరోజుల వ్యవధిలోనే తాను తిరుపతి వెళ్లానని, ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నానని వెల్లడించారు. ఎలాంటి మ్యాటర్ లేని ఈ కేసులో ట్విట్టర్ వేదికగా, టీవీల వేదికగా శునకానందం పొందుతున్న సోదరులందరికీ చెప్పేదొక్కటే, ఇప్పుడు మీరు రాళ్లు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఓ కొండ. ఇలాంటి రాళ్లకు భయపడను. కానీ మీరు ఉన్న గాజు గదులు మీరు విసిరే రాయి దెబ్బకు పగిలిపోతాయి. ముందు ఆ విషయం చూసుకోండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుసరించి నేను ముందుకు వెళుతున్నాను. దేనికీ ఇబ్బంది పడను" అంటూ తనదైన శైలిలో శివాజీ వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు అనుకోని ప్రభుత్వం వచ్చినా పోరాడేందుకు తాను సిద్ధం అంటూ సమరోత్సాహం ప్రదర్శించారు.

కోడ్ ఉల్లంఘనకు సంబంధించి క్లీన్‌చిట్‌లపై తన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం సభ్యుల్లో ఒకరైన అశోక్ లావాసా రాసినట్టు చెబుతున్న లేఖపై కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. భిన్నాభిప్రాయాలనేవి కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటివి చోటుచేసుకున్నాయని అన్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈసీలోని ముగ్గురు సభ్యుల ఆలోచనలు, సారూప్యతలు ఒకలా ఉండాలని అనుకోరాదని, గతంలోనూ ఇలాంటివి జరిగాయని అన్నారు. భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉన్నాయని, ఉంటాయని ఆయన అన్నారు. వీటిని పదవీ విరమణ తర్వాత తాము రాసిన పుస్తకాల్లో ఈసీఐలు, సీఈసీలు పేర్కొన్న సంబర్భాలు లేకపోలేదని అన్నారు.

arora 18052019

తాను సైతం అవసరమైన సందర్భాల్లో బహిరంగ చర్చకు వెనుకాడనని, అయితే ప్రతీ దానికి ఓ సమయం అంటూ ఉంటుందని అరోరా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసిన అంశంలో ఈసీ క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయంలో లావాసా అసంతృప్తితో ఉన్నారు. దీనిపై ఆయన ఈనెల 4న కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాకు లేఖ రాశారు. క్లీన్‌ చిట్‌ ఇచ్చే సమయంలో తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన ఆరోపించారు. ఈసీ ఆదేశాల్లో మైనారిటీ నిర్ణయాలనూ జత చేయాలని లేఖలో పేర్కొన్నారు.

arora 18052019

అరోరా, మరో సభ్యుడు సుశీల్‌ చంద్ర తీసుకుంటున్న నిర్ణయాలతో తాను బలవంతంగా సమావేశాలకు దూరంగా ఉండాల్సివస్తోందని కూడా లావాసా తన సన్నిహితులతో వాపోయినట్టు తెలుస్తోంది. నేతలకు క్లీన్ చిట్ ఇచ్చే సమయంలో తన వాదనను రికార్డు చేయలేదంటూ సీఈసీ అరోరాకు లావాసా లేఖ రాశారు. మైనారిటీ అభిప్రాయాలను కూడా రికార్డు చేయాలని లేఖలో లావాసా పేర్కొన్నారు. అయితే మెజారిటీ అభిప్రాయాలను మాత్రమే రికార్డు చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది. దీంతో ఎన్నికల సంఘం పనితీరుపై ఎన్నికల కమిషనర్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లావాసా లేఖతో ఎన్నికల సంఘం ఇరుకున పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో అంతర్గత కలహాలు తలెత్తగా ఇప్పుడు ఎన్నికల సంఘంలో కూడా అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read