బీహార్‌లో రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా కొద్దిరోజుల ముందు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నించారంటూ నిన్న లాలూ సతీమణి రబ్రీదేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీతో తిరిగి పొత్తు పెట్టుకునేందుకు పలుమార్లు తమ ఇంటికి వచ్చిన ఆయనను తానే వెళ్లగొట్టినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రశాంత్ కిశోర్ ఇవాళ తీవ్రస్థాయిలో స్పందించారు.
‘‘అధికారం, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసుల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్నవారు... తామే సత్యానికి సంరక్షకులమని చెప్పుకుంటున్నారు. పొత్తుకోసం ఎవరు ఎవరికి ఆఫర్ చేశారో తేల్చుకునేందుకు లాలూతో పాటు ఎప్పుడైనా మీడియా ముందు కూర్చునేందుకు నేను సిద్ధం..’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై సీఎం నితీశ్ కుమార్ స్పందించాలంటూ తేజస్వి యాదవ్ సవాల్ విసిరారు. ‘‘నితీశ్ కుమార్ ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఆయన బయటికి వచ్చి మాట్లాడాలి. ప్రశాంత్ కిశోర్ మమ్మల్ని కలిసింది వాస్తవం.
లాలూ పుస్తకంలో కూడా ఇది రాసి ఉంది. దీనిపై ప్రశాంత్ కిశోర్ ఏదైనా ట్వీట్ చేసే ముందు నితీశ్‌తో మాట్లాడడం మంచిది..’’ అని పీకేపై తేజస్వి కౌంటర్ విసిరారు. కాగా రబ్రీ దేవి వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రశాంత్ కిశోర్ చేసిన తాజా ట్వీట్‌పై ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ స్పందిస్తూ.. ‘‘ప్రశాంత్ కిశోర్ ఎందుకు ఈ ట్వీట్లు పెడుతున్నారు? ప్రస్తుతం ఆయన అడ్డంగా ఇరుక్కున్నారు. అసలు సినిమా ముందుంది..’’ అని పేర్కొన్నారు.