ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఈసీ వైఫల్యంతో ఓటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. అయినా తమ హక్కును వినియోగించుకునేందుకు సహనంతో లైన్లలో వేచి ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం పదుల సంఖ్యలోని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ ఓటింగ్ కొనసాగింది. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతం మినహా రాష్ట్రంలో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే. ఆ సమయంలోపు వచ్చి లైనులో నిల్చున్న వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే, పలు కేంద్రాల్లో ఎన్నికల యంత్రాలు మొరాయించడంతోపాటు పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. అధికారులు వీటిని సరి చేసినా కొన్నిచోట్ల మళ్లీ ఇబ్బంది పెట్టడంతో పోలింగ్‌ను ఆపేసి కొత్త యంత్రాలను అమర్చాల్సి వచ్చింది. మరోవైపు ఎండ వేడి కూడా ఎక్కువగా ఉండడంతో కొందరు ఓటర్లు తిరిగి వెళ్లిపోయారు. వీరంతా ఓటు వేసేందుకు సాయంత్రానికి తిరిగి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.
ఆరు గంటల్లోపు వచ్చిన వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ప్రకటించడంతో అర్ధరాత్రి వరకూ కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగింది. దీంతో సాయంత్రం 6 తర్వాత 6,000కు పైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. రాత్రి 10 గంటల సమయంలో 256 కేంద్రాల్లో ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రి 10:30 గంటల వరకూ 139 కేంద్రాలు, 11 గంటల వరకూ 70 కేంద్రాలు, 11:30 గంటల తర్వాత 49 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. అర్ధరాత్రి 12 గంటలు దాటాక కూడా 23 కేంద్రాల్లో కొనసాగుతోంది. రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షించిన గుంటూరుజిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 34వ పోలింగ్ బూత్‌లో రాత్రి 11 గంటలకు ముగిసింది. అయితే ఇక్కడే ఉన్న 37వ పోలింగ్ బూత్‌లో మాత్రం ఓటర్లు అప్పటికీ క్యూలో ఉండడంతో అందరూ ఓటేయడానికి అర్ధరాత్రి 12 గంటలకుపైగా సమయం పట్టొచ్చని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
గుంటూరుజిల్లా తెనాలి పట్టణంలోని నందులపేటలో 117 పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించడంతో... వాటిని సరిచేసి అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగించారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులోని 168వ నంబరు పోలింగ్ పోలింగ్ బూత్‌లో అర్ధరాత్రి 11.30 గంటలు దాటినా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. నెల్లూరుతోపాటు కృష్ణాజిల్లాలోని గుడివాడ, మైలవరం నియోజకవర్గాల్లోనూ రాత్రి 11 గంటలు దాటినా పోలింగ్ కొనసాగింది. ఇక విజయనగరం జిల్లాలో రాత్రి 9గంటలు దాటిన తర్వాత కూడా పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, కొత్తకొప్పెర్ల, వెంపడాం పంచాయతీ తాళ్లపేట గ్రామాల్లో పోలింగ్ నిర్వహించారు. తిప్పలవలసలో 125 నంబరు పోలింగ్ బూత్‌లో చాలాసార్లు ఈవీఎంలు మార్చాల్సివచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంటకు సుమారు 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తర్వాత 300 ఓట్లు పోలయ్యాక మళ్లీ పరికరాలు మొరాయించడంతో అధికారులు వాటిని సరి చేసి పోలింగ్‌కు అనుమతిచ్చారు. దీంతో, ఇక్కడ అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. శ్రీకాకుళంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బూరగాం, రత్తకన్న, తేలుకుంచి గ్రామాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది.