ఏప్రిల్ 1 నుంచి 5 మధ్య 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్సెన్టీ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ సర్వే ఏపీలో అధికారం మళ్లీ టీడీపీదేనని అంచనా వేసింది. టీడీపీ 108 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. వైసీపీ 65 సీట్లు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. జనసేనకు 2 సీట్లు దక్కుతాయని తెలిపింది.ఇక సీఎం చంద్రబాబు పనితీరుపై, ప్రతిపక్ష నేత జగన్ తీరుపై కూడా ఈ సంస్థ అభిప్రాయాలను సేకరించింది. చంద్రబాబు ప్రభుత్వంతో మీ కుటుంబానికి మేలు జరిగిందా అంటే అవును అని 62 శాతం, లేదు అని 38శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు పాలనకు మంచి మార్కులే పడ్డాయని తేలింది.
జగన్ నవరత్నాల గురించి అడిగితే.. 88శాతం మంది అసలు అవంటే ఏంటో తెలియదని చెప్పడం కొసమెరుపు. బీజేపీపై ప్రజల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో కూడా ఈ సర్వేలో స్పష్టమైంది. మోదీ ఏపీకి అన్యాయం చేశారా అంటే 94శాతం మంది అవునని కుండబద్ధలు కొట్టడం గమనార్హం. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని 49శాతం మంది, జగన్ సీఎం కావాలని 42శాతం మంది భావిస్తున్నట్లు సర్వే తెలిపింది. పవన్ సీఎం కావాలని 8శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించింది. జగన్-కేసీఆర్-మోదీ ఒక్కటేనని ఏపీలో 75శాతానికి పైగా నమ్ముతున్నారని సోషల్ పోస్ట్ సర్వే పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై వేధింపులని, అందులో భాగంగానే ఏపీ అధికారులను ఈసీ బదిలీ చేస్తోందని 75శాతానికి పైనే నమ్ముతున్నట్లు ఈ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఏపీలో కేసీఆర్ జోక్యానికి 75శాతానికి పైనే వ్యతిరేకమని సర్వేలో వెల్లడైంది.