రాష్ట్ర రాజకీయాల్లో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ‘అరాచకీయ’ వ్యూహాలకు తెరలేస్తోంది. ప్రజల ఓట్లతో గెలవడమనే సంప్రదాయానికి పాతరేసి ‘ప్రత్యర్థి అభ్యర్థులను బరిలోంచి తప్పించడం’ అనే అసాధారణ కుట్ర రచిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం 10 మంది టీడీపీ అభ్యర్థులపై గురిపెట్టి... వారిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం కేంద్రంగా పావులు కదుపుతున్నట్లు తెలుగుదేశం అధిష్ఠానానికి సమాచారం అందింది. నామినేషన్ల ఉపసంహరణలోపు పది మంది అభ్యర్థులను తప్పించగలిగితే.. టీడీపీ బలహీనంగా మారుతుందన్న అంచనాతో ఈ వ్యూహం ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొరుగు ఒత్తిళ్లే దీనికి కారణమని టీడీపీ అధిష్ఠానం కూడా నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యూహం ఆ ఇద్దరితోనే ఆగిపోలేదని, జాబితాలో మరికొందరు ఉన్నారని తెలుస్తోంది. రకరకాల మార్గాల్లో వీరిపై ఒత్తిడి తేవడం ద్వారా వీలైతే అసలు నామినేషన్ వేయకుండా ఆపడం... వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడం... అదీకాకపోతే, చివరి క్షణంలో ప్రచారాన్ని పక్కనపెట్టి మౌనం వహించేలా చూడటం! ఇలా ఏదో ఒక దశలో ఒత్తిడి తెచ్చి... ఆ స్థానాల్లో వెసీపీ గెలుపును సులువు చేయడమే ఈ వ్యూహం అసలు లక్ష్యం. ఏపీలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న చాలామంది అభ్యర్థులకు హైదరాబాద్‌లో వ్యాపారాలు, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి ఆర్థిక ప్రయోజనాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వాటిని పూర్తిగా తెంచుకొనే పరిస్ధితి లేదు. ఈ నేపథ్యంలో... టీడీపీలో బలమైన అభ్యర్థులను ఎంచుకొని వారి వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. అందులో ఉల్లంఘనలు, సమస్యలను భూతద్దం వేసి వెతుకుతున్నారు. ఎక్కడ చిన్న లోపం కనిపించినా... సంబంధిత శాఖల నుంచి ముందు నోటీసు జారీ అవుతాయనే హెచ్చరికలు పంపిస్తున్నారు. దీంతో సదరు నేతలు కంగారుపడిపోయి ఆ శాఖల అధికారులను సంప్రదిస్తున్నారు.
మీరు వెళ్లి ఫలానా నాయకులను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అప్పటికే వీరి వ్యూహమేమిటో అవగతమవుతుంది. ఆ నాయకులను కలవడానికి తటపటాయిస్తే... వచ్చి మాట్లాడాలని ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆ నాయకులను కలిసిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. ‘‘టీడీపీ నుంచి బయటకు వస్తే ఏ సమస్యా ఉండదు. మీ వ్యాపారం హాయిగా చేసుకోవచ్చు. రాజకీయాల కోసం విలువైన ఆస్తులను పాడు చేసుకోవద్దు. మీ మంచికోసమే చెబుతున్నాం’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా... తమ మాట విని లాభపడిన వారు, వినకుండా నష్టపోయిన వారి ఉదాహరణలు కూడా వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోందో సూచించే ‘సొంత’ సర్వే నివేదికలను వారి ముందు పెట్టి... ‘మైండ్‌గేమ్’ ఆడుతున్నారు. వైసీపీలో రాజకీయంగా మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యత తమదని, భయాలేవీ పెట్టుకోవద్దని కూడా భరోసా కూడా ఇస్తున్నారు. కొద్దిగా మెత్తబడ్డారనుకొన్న వారిపై ఒత్తిడి మరింత కొనసాగిస్తున్నారు. మరింత విస్తృతం... టికెట్ల జారీ దశలోనే ఒత్తిడి వ్యూహం అమలు చేయడం ప్రారంభమైంది. కొందరి విషయంలో ఇది ఫలించడంతో... పొరుగు నేతల్లో మరింత ఉత్సాహం పెరిగిందని అంటున్నారు. టికెట్లు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు రెండో దశ ప్రయత్నాలు మొదలయ్యాయి.
టీడీపీలో టిక్కెట్టు వచ్చి పోటీ చేయడానికి సంసిద్ధులు అవుతున్న వారిలో ఎవరినైనా ఆపడానికి అవకాశం ఉందా అన్నదానిపై దృష్టి సారించారు. పది మంది అభ్యర్థులను లక్ష్యంగా ఎంచుకొని ఒత్తిడి పెంచారని ప్రచారం జరుగుతోంది. దాఖలు చేసిన నామినేషన్‌ను చివరి క్షణంలో ఉపసంహరించుకునేలా చేస్తే అప్పటికప్పుడు టీడీపీకి మరో గట్టి అభ్యర్థి దొరకరని, కొత్తగా నామినేషన్ వేయించే అవకాశం ఉండదన్న యోచనతో ఈ వ్యూహానికి రూప కల్పన జరిగిందని అంటున్నారు. పోనీ... సమస్యను గుర్తించిన నియోజకవర్గాల్లో ముందు జాగత్త్రగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్ దాఖలు చేయిద్దామంటే, ‘నాపై నమ్మకం లేదా’ అని అసలు అభ్యర్థి అలిగే అవకాశంముంటుంది. వెరసి... అభ్యర్థులమీద అధిష్ఠానానికి... అధిష్ఠానం మీద అభ్యర్థులకు అపనమ్మకం తలెత్తే విపత్కర పరిస్థితికి ఇది దారి తీస్తుంది. ‘పొరుగు’ నుంచి ఒత్తిడికి గురవుతున్న వారిలో కొందరు వాటిని మౌనంగా భరిస్తున్నారు. వాటి గురించి బయట చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒకరిద్దరు అభ్యర్థులు మాత్రం చంద్రబాబును కలిసి జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు సమాచారం. అంతకు ముందే అధిష్ఠానం వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉంది. సమస్య ఉందనుకొన్న వారితో చంద్రబాబు నేరుగా మాట్లాడుతూ భరోసా ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తున్నామని, అనవసర భయాలు పెట్టుకోవద్దని వారికి చెబుతున్నారు. దీంతో కొందరు అభ్యర్థులు యథావిధిగా ప్రచార రంగంలోకి వెళ్తున్నారు.