పసుపు కుంకుమ పథకం కింద అందించాల్సిన రెండో విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మహిళా దినోత్సవ కానుకగా శుక్రవారం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరి ఖాతాల్లో రూ. 3,500 వేలు పడేలా అన్ని ఏర్పాట్లు చేసింది. పసుపు కుంకుమ కింద ఇప్పటికే రూ.10 వేలు అందించిన రాష్ట్ర సర్కారు, మహిళలకు మరింత సాధికారికత, ఆర్థిక చేయూత అందించడం కోసం మరో 10 వేలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా తొలి కిస్తీ కింద రూ. 2,500 గత నెలలో డ్వాక్రా మహిళలకు అందించారు. ఇప్పుడు రెండో విడత కిస్తీని చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారమిక్కడ జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సీఎం గట్టి ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ లోకానికి శుభాకాంక్షలు తెలుపుతూ పసుపు-కుంకుమ మలివిడత కానుకను అందిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇస్తున్న మొత్తం రూ.10 వేలలో ఇప్పటికే ఫిబ్రవరి 1న రూ.2,500 చొప్పున చెల్లించామని, మిగతా రూ.4 వేలు త్వరలోనే జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన ప్రకటనలోని ముఖ్యాంశాలు.. * మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తి హక్కును తీసుకొచ్చి మహిళా సాధికారతకు మహా నాయకుడు ఎన్టీ రామారావు బాట వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. * దళిత మహిళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ చేశాం. మంత్రివర్గంలోకి మహిళా మంత్రులను తీసుకున్నాం. రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్ల, సహాయకుల జీతాలు రెండు దఫాలుగా పెంచాం. మహిళా హోంగార్డుల ప్రసూతి సెలవూ పెంచాం.
* స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి బడికొస్తా పథకం కింద రూ.207 కోట్ల వ్యయంతో 5.61 లక్షల సైకిళ్లు పంపిణీ చేశాం. 3 లక్షల మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించాం. * తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో 7.45 లక్షల మంది లబ్ధి పొందారు. మహిళలకు సామాజిక భద్రత కల్పించాం. ప్రతి ఇంటా ఓ మహిళా వ్యాపారవేత్త తయారు కావాలన్నదే మా ప్రభుత్వ ఆశయం. ప్రైవేటు రంగంలో వచ్చిన మొబైల్ పరిశ్రమల్లో మహిళలకే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. * మహిళలు అన్నింటా మగవారితో సమానంగా ఉండాలన్నదే మా ఆశయం. మహిళా సాధికారత లేని సమాజాన్ని ఊహించడం కష్టం. మహిళ చదువుకుంటే కుటుంబమంతా విజ్ఞానవంతులు అవుతారు. నిర్ణయాధికారంలోనూ వారు భాగస్వాములు కావాలి.