ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగించే కుట్రపై వైకాపా నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఫారం-7 ద్వారా నకిలీ దరఖాస్తులతో ఓట్లు తొలగించే కుట్రకు వైకాపా పాల్పడుతోందని.. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్, భాజపాతో చేతులు కలిపి వైకాపా అధ్యక్షుడు జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం కుర్చీ కోసం ఎన్ని అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్ అని ఉమ విమర్శించారు. జగన్ కు అధికార పిచ్చి పట్టుకుందని, అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కుట్రలకు పాల్పుడుతోందని అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అందుకే కులాలు, మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారని ఉమ దుయ్యబట్టారు. ‘‘అధికారమే పరమావధిగా జగన్ మాట్లాడుతున్నారు. ఫారం-7 తానే దరఖాస్తు చేయించానని జగన్ ఒప్పుకున్నారు. జగన్ ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో 24లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఏపీలో 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర పన్నారు. నెల్లూరు సభలో జగన్ మాట్లాడిన భాష జుగుప్సాకరం. ఓ అజెండా లేకుండా దిక్కుతోచని స్థితిలో ఆయన మాట్లాడుతున్నారు’’ అని ఉమ ధ్వజమెత్తారు.
లోటస్ పాండ్ లో కేటీఆర్, జగన్ లు సమావేశమయిన తర్వాతే డేటా చోరీకి ప్లాన్ జరిగిందని దేవినేని తెలిపారు. ఫామ్ 7 దరఖాస్తులను తామే పెట్టామని జగన్ ఒప్పుకున్నారని... ఆయనపై ఎన్నికల సంఘం ఏ1 మద్దుయిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ వాడుతున్న భాష చాలా నీచంగా ఉందని మండిపడ్డారు. ఎలాంటి అజెండా లేని జగన్... పసలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా ఉందని... రిజర్వ్ బ్యాంకే ఈ విషయాన్ని ప్రకటించిందని చెప్పారు. ఐటీ యాక్టును టీఆర్ఎస్, వైసీపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. వైఎస్ జగన్ పదవీ వ్యామోహంతోనే ఏపీపై కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్ లో కేసీఆర్, జగన్ లు పనిచేస్తున్నారని, ఈ ఆటలు తమ దగ్గర సాగవన్నారు. ఇప్పటికైనా ఏపీ డేటా చోరీ విషయంలో అసలు విషయాలను బయటపెట్టాలన్నారు.