ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, ప్రధాని న్యాయమూర్తి బెంచ్ ముందు, విశాఖపట్నంలోని రుషికొండ విధ్వంసం పై విచారణ జరిగింది. రుషికొండ పై అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటి పై గత విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో ఉన్న అయుదు మంది అధికారులతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీ వెంటనే సర్వే చేసి, ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిపారో, తమకు తెలపలాని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సర్వే అఫ్ ఇండియా, ఎన్విరాన్మెంట్ల్ డిపార్టుమెంటు, అదే విధంగా మైనింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, ఇలా అయుదు మంది అధికారులతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అందుకు భిన్నంగా, ఈ కమిటీలో ముగ్గురు రాష్ట్ర అధికారులను నియమించడంపై, ఈ రోజు విచారణ సందర్బంగా పిటీషనర్ తరుపున సీనియర్ న్యాయవాదులు వీరా రెడ్డి, అశ్వినీ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
దీని పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముగ్గురిని నియమిస్తే మేము ఎలా ఆమోదిస్తామని, మీరు మాత్రం అసలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులని ఎలా నియమిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీన్ని వెంటనే సరి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ముగ్గురినీ తొలగించి, కేవలం కేంద్ర ప్రభుత్వ అధికారులను మాత్రమే వేయాలని ఆదేశించింది. రుషికొండలో కొంత మేర అక్రమ తవ్వకాలు జరిగాయని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేవలం కొద్ది వరుకే జరిగాయని చెప్పింది. అయితే పిటీషనర్ తరుపున న్యాయవాదులు మాత్రం, చాలా వరకు అక్రమ తవ్వకాలు జరిగాయని కోర్టుకు చెప్పారు. దీంతో ఈ నిజా నిజాలు నిగ్గు తేల్చి, విషయం తమకు చెప్పాలని, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఒక కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముగ్గురిని రాష్ట్రము నుంచి పెట్టటంతో, హైకోర్టు సీరియస్ అయ్యింది.