తొలి రోజే కేరళ రాష్ట్రం కొచిన్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం హౌస్‌ఫుల్ అయింది! దేశీయ విమానయాన రంగంలో విజయవాడ ఎయిర్‌పోర్టు మరో ప్రస్థానాన్ని ప్రారంభించింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఏడవ రాష్ట్ర సర్వీసుగా కేరళ రాష్ట్రంలోని కొచిన్ విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. పొరుగు రాష్ర్టాలైన తెలంగాణాలో హైదరాబాద్‌కు, తమిళనాడులోని చెన్నై, కర్నాటకలోని బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజఽధాని ముంబాయిల తర్వాత.. ఏడవ రాష్ట్ర సర్వీసుగా కేరళ రాష్ట్రం కొచిన్‌కు సర్వీసు ప్రారంభం కావటం గమనార్హం. స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఈ సరీసును ప్రారంభించింది. ఈ సర్వీసు రోజూ విజయవాడ నుంచి కొచిన్‌కు బయలు దేరటం గమనార్హం. రోజు సాయంత్రం స్పైస్‌జెట్ విమానం 4.20 వచ్చి 5 గంటలకు బయలుదేరి తిరుపతి మీదుగా కొచ్చిన్ వెళుతుంది.
ఈ సర్వీసుకు సంబంధించి 72 సీట్ల సామర్ధ్యం ఉంది. తొలి రోజు అన్ని సీట్లు నిండాయి. దేశీయంగా పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కేరళ ప్రధానమైనదని చెప్పుకోవాలి. దేశీయంగా కేంద్ర పాలిత ప్రాంత గోవాతో సరిసమానంగా కేరళకు పర్యాటకల సంఖ్య పోటెత్తుతుంటుంది. ప్రధానంగా కోస్తా జిల్లాల ప్రాంతాల ప్రజలకు కేరళ రాష్ట్రంతో ప్రత్యేక బంధం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కువుగా కేరళ రాష్ర్టానికి పర్యాటక విడిది చేస్తుంటారు. అక్కడి సహజ అందాల నేపథ్యంలో, ప్రతి వేసవి సీజన్లోనూ భారీ సంఖ్యలో పర్యాటకులు కేరళ వెళుతుంటారు. కేరళ వెళ్లేవారికి ఈ విమాన సర్వీసు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
పర్యాటకుల అవసరాలను తీర్చటంలో ఎంతగానో ఈ విమాన సర్వీసు దోహదపడనుంది. వీటన్నింటికంటే మించి చూస్తే ప్రధానంగా శబరిమలై వెళ్లే యాత్రికులకు మన ప్రాంతం నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ విమాన సర్వీసు ద్వారా త్వరగా శబరిమలైకు చేరుకుని అయ్యప్పస్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. కొచిన్ సర్వీసును ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి ఓటింగ్ పాస్‌ను ఎనికేపాడుకు చెందిన ఫాదర్ జోసఫ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ దీనివలన తిరుపతి, బెంగళూరు, కొచ్చిన్ వెళ్ళేవారికి మంచి సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఎయిర్‌పోర్టు ఏసీపీ వెంకటరత్నం, సంస్థ ప్రతినిధి కుతుబ్ తదితరులు పాల్గొన్నారు.