నూజివీడు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పనితీరు 86.5 శాతంతో జిల్లాలోనే సంతృప్తి కరంగా ఉందని మంగళవారం జరిగిన సమీక్షా సమావేశ సభావేదికపైనే జిల్లా నాయకులు ప్రకటించారు. అయినా ఇక్కడి స్థానిక నాయకత్వంపై పలువురు నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ స్థానిక నాయకులు ఎందుకు ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేరును అభ్యర్థిగా అంగీకరిస్తూ మద్దతు తెలుపలేకపోయారు?, బహిరంగ వేదికపై ‘చంద్రబాబు టికెట్‌ ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం..’ అని చెప్పిన నాయకులు, విడివిడిగా ముద్దరబోయినపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. ఈ నియోజకవర్గంలో పార్టీ పనితీరు సంతృప్తికరంగా ఉండగా, దానికి విరుద్ధంగా స్థానిక నాయకులు నూజివీడు ఇన్‌చార్జిపై సంపూర్ణ మద్దతు తెలపకపోవడంతో, రాష్ట్ర, జిల్లా నాయకులకు తలనొప్పిగా మారింది.

krishna 01032019

జిల్లా ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు తప్ప జిల్లా మంత్రులెవరూ మొదటి నుంచి నూజివీడు టీడీపీ వర్గ వివాదంలో తలదూర్చలేదు. సామాజిక రిజర్వేషన్‌తో నూజివీడు టికెట్‌ ముడిపడి ఉండటంతో అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు ఆచీతూచీ నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టికెట్‌లు ఖరారయ్యాక చివరిగా నూజివీడు టికెట్‌ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదిష్టానం ఆదేశిస్తే నూజివీడు, గుడివాడ నుంచి పార్టీ తరఫున తాను పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు చేసిన ప్రకటనపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తున్న బచ్చుల అర్జునుడు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించకుండా ఇలాంటి ముఖ్య ప్రకటనలు చేయరు. దీంతో నూజివీడు విషయంలో పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని స్థానిక టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పట్ల నియోజకవర్గంలోనే పలువురు నాయకులు సంతృప్తికరంగా లేరని స్పష్టమైన ఈ దశలో వారి మధ్య సయోధ్య కుదర్చకుండా టికెట్‌ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

krishna 01032019

మంగళవారం రాత్రి సమీక్షా సమావేశం ముగిసిన తరువాత సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో విడివిడిగా మాట్లాడారు. త్వరలోనే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదామంటూ ముద్దరబోయిన భుజం తట్టి రాత్రి 2 గంటలకు పంపినట్లు సమాచారం. దీంతో నూజివీడు టీడీపీ సీటు చివరి నిమిషంలో పీఠముడి పడినట్లు అయింది. గతంలోలా నూజివీడు టికెట్‌ చివరి నిమిషంలోనే తేలుతుందనే అభిప్రాయం నియోజకవర్గంలో సర్వత్రా వ్యక్తమవుతోంది. స్థానిక టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని ఓ కీలక నేత, మాజీ మంత్రిమరో వారం రోజుల్లో టీడీపీ తీర్థం తీసుకుని, నూజివీడు నుంచి రంగంలోకి దిగటానికి చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ వీరి మధ్య సయోధ్య కుదిరి, ఆ నేత నూజివీడు నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగితే సామాజిక సమీకరణాల్లో పూర్తి న్యాయం జరగటమే కాకుండా, జిల్లాలో మరో మూడు నియోజకవర్గాల్లో మరింత సంతృప్తికరంగా పార్టీ పరిస్థితి ఉంటుందనే యోచనలో టీడీపీ కీలక నాయకులు భావిస్తున్నారు. ఈ నేతతో జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాకే నూజివీడు అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

వైసీపీలో వర్గపోరు పతాకస్థాయికి చేరుకుంది. వైసీపీ అధినేత జగన్‌ గృహ ప్రవేశానికి ఆయన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జగన్‌పై బాబాయ్‌ అలకే దీనికి కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నందునే వైవీ రాలేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. జగన్ మాత్రం టికెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పేశారనే ప్రచారం జరుగుతోంది. సుబ్బారెడ్డి సేవలను పార్టీ ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయించారు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా వైసీపీలో చెరోదారిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, బాలినేని వర్గాలను పక్కనపెట్టి ఇతర నాయకులను ఆకర్షించేందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.

vijaysai 01032019

ఇందులోభాగంగా దగ్గబాటి హితేష్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేర్చారు. అంతేకాదు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. మాగుంటను చేర్చుకోవడాన్ని వైవీ వ్యతిరేకించారు. ఓడిపోయిన వ్యక్తి తమకు అక్కరలేదంటూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా తానే బరిలో దిగుతానంటూ ప్రకటించుకున్నారు. వైవీ వ్యాఖ్యలపై జగన్‌కు పార్టీ నేతలు ఉప్పందించారు. అయినప్పటికీ వైవీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంపీగా పోటీకి సిద్ధమని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. టికెట్‌పై ఒత్తిడి పెంచేందుకు వైవీ కుటుంబంతో సహా జగన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో టికెట్ లేదని కరాఖండిగా చెప్పేశారని ప్రచారం జరుగుతోంది.

vijaysai 01032019

జగన్ తీరుతో సుబ్బారెడ్డి కుటుంబసభ్యులంతా మనస్తాపానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఒంగోలుకు వెళ్లిపోయారు. తాడేపల్లిలో జగన్ గృహప్రవేశానికి కూడా హాజరుకాలేదు. సహజంగా కుటుంబ వ్యవహారాలను సుబ్బారెడ్డే చూసుకుంటారు. ఈ సారి మాత్రం వారి కుటుంబసభ్యులు ఎవ్వరూ కనిపించలేదు. సుబ్బారెడ్డి భార్య వైఎస్ విజయమ్మ సోదరి. సహజంగానే కుటుంబ కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి కనిపిస్తుంటారు. గృహప్రవేశంలో మాత్రం సుబ్బారెడ్డి భార్య కనిపించలేదు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వైవీ కుటుంబం హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి అని కూడా చెబుతున్నారు. భవిష్యత్తులో సుబ్బారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. అంతేకాదు ఈ కుటుంబ కలహాలు వైసీపీలో ఎలాంటి పరిణామాలు దారి తీస్తాయోనని వైసీపీ వర్గాలకు గుబులు పట్టుకుంది.

ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. సహజంగానే ఓ వైపు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీకి విశాఖ సిట్టింగ్ సీటు అందుకే సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉంది. గుంటూరులో లాగా బీజేపీ సభకు వైసీపీ సహకారం అందిస్తోందని... ఇతర పార్టీలు అనుమానిస్తున్నాయి. బీజేపీతోపాటు విడిగా అయినా వైసీపీ కూడా రైల్వే జోన్ సంబరాలు చేసుకోవడమే ఇందుకు కారణం. కానీ జోన్ ప్రకటనతో ప్లస్ కన్నా మైనస్సే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఏర్పుడతోంది. మోదీ రెండు నెలల కింద దేశీయ పర్యటనలు ప్రారంభించారు. ఎన్నికల ప్రకటన వచ్చేలోపు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర పరిధిని బట్టి రెండు నుంచి 6 సభల్లో పాల్గొనాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ ఖర్చుతో జరిగే సభలే.

modi 01022019

అయితే ఇప్పుడు మోదీ బహిరంగ సభ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. సభకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. జోన్ పై బీజేపీ చేసిన డ్రామాలే దీనికి కారణం. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బహిరంగ సభ ‘ఫ్లాప్‌’ అయ్యింది. బీజేపీ నేతలు మూడువేల కుర్చీలు వేశారుకానీ, మూడొందల మందిని కూడా సమీకరించలేకపోయారు. దీంతో అమిత్‌ షా సభా వేదిక కూడా ఎక్కకుండా... బస్సుపై నుంచే ప్రసంగించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో... మోదీ సభకు జన సమీకరణ చేయడంపై బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాన్ని సమీకరించటం అంత సులువు కాదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది.

modi 01022019

‘ఏది ఏమైనా, ఎలాగైనా’ మైదానం నిండాలని... దీనికోసం టీడీపీ వ్యతిరేక పక్షమైన వైసీపీ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వైసీపీ కీలక నేతలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీపై పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఒకవేళ ప్రధాని సభకు ప్రజాదరణ కరువైతే... చంద్రబాబు వాదనకు బలం చేకూరినట్లవుతుందని, దీనికోసమైనా బీజేపీ సభకు సహకరించాలని వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. గుంటూరులో కూడా జగన్ ఆటోల్లో ఎలా తరలించారో, వీడియోలతో సహా చుసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక మరో కుట్రలో భాగమని, దీన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల నిరసన ఇవాళ ప్రతిబింబించాలని సూచించారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన విశాఖ జోన్ ఓ మాయా జోన్‌ అని, భాజపా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని విమర్శించారు. ‘మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్లచొక్కాలతో నిరసన తెలపాలి..., నేనుకూడా నల్లచొక్కా ధరిస్తా’నని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా నిర్వహించే ధర్మపోరాట నిరసనలతో రాష్ట్రం హోరెత్తాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్ల బెలూన్లు, నల్లజెండాలతో నిరసన తెలపాలన్నారు.

pk 01032019 2

మరో ఐదారు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 13 నియోజకవర్గాల సమీక్షలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. యుద్ధం గురించి రెండేళ్ల క్రితం చెప్పారని పవన్ వ్యాఖ్యలే భాజపా దుర్మార్గ రాజకీయాలకు రుజువని చంద్రబాబు అన్నారు. తాజాగా యడ్యూరప్ప వ్యాఖ్యలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పారు. నిన్న కడప బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో బీజేపీ యుద్ధం చేస్తుందని, తనకు రెండేళ్ళ ముందే తెలుసని చెప్పిన విషయం తెలిసిందే.

pk 01032019 3

మరో పక్క, తెలుగుదేశం ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని వైకాపా తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందన్నారు. ఫారం-7ను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కట్టల కట్టలు దరఖాస్తులు పంపిస్తున్నారన్న విషయం పొన్నూరు, నర్సీపట్నంలో బయటపడిందని గుర్తుచేశారు. వేలాది ఓట్లు తొలగించాలని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, వైకాపా కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి కుట్రలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. దొంగే దొంగ అనడం వైకాపాకు పరిపాటిగా మారిందని ఎద్దేవాచేశారతు. వాళ్లే ఓట్లు తొలగించి తెదేపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisements

Latest Articles

Most Read