విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెలంపల్లి శ్రీనివాస్ వైసీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ తనదేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాలని కోరాడ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోరాడ విజయ్‌కుమార్ ఉవ్విళ్లూరుతున్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీలో వెలంపల్లిని వ్యతిరేకిస్తున్న వర్గాన్ని అక్కున చేర్చుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు. వైసీపీ టికెట్‌ను దక్కించుకోవడానికి కోరాడ విజయ్‌కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే వెలంపల్లి, కోరాడ మధ్య అంతర్యుద్ధానికి కారణమైంది. విజయ్‌కుమార్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కోరాడ చిట్‌ఫండ్ కంపెనీని నడుపుతున్నారు. త్వరలో ఈ చిట్‌ఫండ్ కంపెనీని మూసివేస్తున్నారని వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
వెలంపల్లి యూత్ పేరుతో ఈ తరహా పోస్టింగ్‌లు వస్తున్నాయి. దీనిపై కోరాడ విజయ్‌కుమార్ సైబర్ క్రైం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు. ఈ విషయంలో కోరాడ విజయ్‌కుమార్‌కు పారిశ్రామికవేత్త కోగంటి సత్యం బాసటగా నిలుస్తున్నారు. విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఆయన వెంట సత్యం రావడం గమనార్హం. వెలంపల్లి, కోగంటి సత్యం మధ్య కొద్దికాలంగా వివాదాలు ఉన్నాయి. ఇటు కోరాడకు, అటు కోగంటికి కామన్ శత్రువుగా వెలంపల్లి మారారు. దీంతో కోరాడ, కోగంటి కలిసి వెలంపల్లి దూకుడుకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు.
పశ్చిమ నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు కోరాడ ఫౌండేషన్ చైర్మన్ కోరాడ విజయ్‌కుమార్ తెలిపారు. పాత బస్తీ జెండాచెట్టు సమీపంలోని ఆయన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21 నుంచి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలోనూ బీసీలకు తగిన ప్రాధా న్యం ఇవ్వలేదని, ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా పాద యాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ముందుకు సాగుతానని తెలిపారు. నియోజకవర్గంలో 85 శాతం పేదలు, ముఖ్యంగా కొండప్రాంతంలోని ప్రజల జీవనవిధానం పూర్తిస్థాయిలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు.