లాల్ కిషన్ ఆడ్వాణీ...భాజపాకు బీజం వేసి, కమలం వికసించేలా చేసిన కీలక నేత. అందరిచే లోహ్ పురుష్ (ఉక్కు మనిషి) అని ప్రశంసలు అందుకున్న పెద్దాయన. దేశం నలుమూలలా పర్యటించి తన వాగ్ధాటితో అందర్నీ ఆకట్టుకున్న రాజకీయ దురంధరుడు. క్రమశిక్షణలో ఆయనకు ఆయనే సాటి. అయితే దేశంలో జరుగుతున్న విషయాలు అన్నీ చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. అమిత్ షా, నరేంద్ర మోడీ, ఇద్దరూ కలిసి చేస్తున్న పనుల పై ఎంత కోపం ఉన్నా, ఆయన ఏమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఆయనది. చివరకు మోడీ స్టేజి మీదే అద్వానీని అవమానించినా, దేశం మొత్తం నివ్వెరపోయినా, ఒక్క మాట కూడా మోడీని, అమిత్ షా ను అనకుండా ఉండి పోయారు.
ఈ నేపధ్యంలో బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ ఆడ్వాణీ ఎన్నికల రాజకీయాలకు స్వస్తి పలికారు. ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మోదీ బలవంతం మీద గాంధీనగర్ నుంచి చివరిసారిగా ఆయన పోటీ చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గతవారం స్వయంగా ఆడ్వాణీని కలిసి గాంధీనగర్ నుంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో, కనీసం ఆడ్వాణీ సంతానమైన ప్రతిభ, జయంత్‌లలో ఒకరిని గాంధీనగర్ బరిలో దింపాలని, వారిని గెలిపించుకొనే బాధ్యతను తీసుకుంటామని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా ఆడ్వాణీ నిరాకరించారు. ‘‘కుదరదు. ధన్యవాదాలు’’ అని ముక్తసరిగా చెప్పి అమిత్‌షాను తిప్పి పంపినట్లు తెలుస్తోంది.
అయితే అద్వానీ గారి మౌనం పార్లమెంట్ లో కూడా కొనసాగింది. గత అయిదేళ్లలో పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరు 92 శాతం. కానీ ఎలాంటి ప్రసంగాలూ చేయడంలేదు. అయిదేళ్లలో ఆయన మాట్లాడిన మాటలు కేవలం 365 మాత్రమే. మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో యూపీఏ-2 అధికారంలో ఉన్నప్పుడు 2012 ఆగస్టు 8న అసోంలోని అక్రమ వలసల సమస్యపై ఆయన వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆయన ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు కనీసం 50సార్లు అడ్డం తగిలారు. అయినా తాను చెప్పాల్సింది చేప్పేవరకు ప్రసంగాన్ని ఆపలేదు. మొత్తం 4,957 పదాలు మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికే పౌరసత్వ బిల్లును తీసుకొస్తున్నట్టు ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ప్రకటించింది. గతనెల 8న బిల్లు ప్రవేశపెట్టగా ఆడ్వాణీ సభలో ఉన్నప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 15వ లోక్‌సభ కాలంలో (2009-14) ఆయన 44 చర్చల్లో పాల్గొని 35,926 పదాలు మాట్లాడినట్టు రికార్డులు వెల్లడిచేస్తున్నాయి. ప్రస్తుతం అయిదు సందర్భాల్లో మాత్రమే మాట్లాడారు. అందులో రెండు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా చేసినవి. ఆ రెండు సందర్భాల్లోనూ ‘ఈ తీర్మానానికి నేను మద్దతు తెలుపుతున్నాను’ అని మాత్రమే చెప్పారు. 2014 డిసెంబరు 19 తరువాత ఆయన లోక్‌సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొదటి వరుసలో కూర్చొంటున్నా మౌనంగానే ఉంటున్నారు.