ప్రధాని మోదీలో నాయకత్వ లక్షణాలు లేవని, దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయం ఏమాత్రం ఆయనకు లేదని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తాము న్యాయం కోసం పోరాడుతుంటే, భాజపా నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి జాతకాలు విప్పితే మళ్లీ తలెత్తుకుని తిరగలేరని హెచ్చరించారు. విభజన హామీలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం నేతృత్వంలోని బృందం మంగళవారం కలిసింది. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ 17 పేజీల వినతి పత్రం అందించింది. విభజన చట్టంలోని అంశాలు, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు భర్తీ తదిరత అంశాలను సీఎం చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రపతి రాజ్యంగపరమైన అధినేత అని, అంతిమంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. తమకు న్యాయం జరగకుంటే కోర్టు తలుపులు తడతామని, అక్కడా న్యాయం జరగకుంటే ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్ధాలతోనే భాజపా కాలం వెళ్లదీస్తోందన్నారు. అందుకు రాష్ట్రంలో వైకాపా సహకరిస్తోందన్నారు. భాజపా, వైకాపా కలిసి పోటీ చేయాలని చెప్పారు. రాష్ట్రంపై అంత చిత్తశుద్ధే ఉంటే తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హోదా కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాకుళం వాసి మృతి పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రధాని మోదీలో నాయకత్వ లక్షణాలు లేవని చంద్రబాబు విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనా మోదీకి ఏ కోశానా లేదన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని చూసి ఎంతో మంది కలతచెందారని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ వికలాంగుడు అర్జున్‌రావు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. తమ పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో ధర్మపోరాట దీక్షలు చేశామని, ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తం తెలియజేశామన్నారు. ఏపీకి విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిరంతరం పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.