ఏపీకి న్యాయం చేయడం చేతకాని ప్రధాని మోదీ ఇక్కడకొచ్చి తిట్టేసి పోయారని, అవాస్తవాలు మాట్లాడి, ప్రజల ముఖాన ఇంత మన్ను, నీళ్లు కొట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. 'గో బ్యాక్' అంటే మోదీని ఢిల్లీకి పొమ్మనో, మళ్లీ అధికారం చేపట్టమనో కాదని, ఢిల్లీ గద్దె దిగి గుజరాత్‌కు పొమ్మని జనం తెగేసి చెబుతున్నారని అన్నారు. మోదీ గుంటూరులో చేసిన ప్రసంగంలో తనపై చేసిన విమర్శలను అంతే దీటుగా చంద్రబాబు తిప్పికొట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచామని మోదీ తనపై విమర్శలు చేశారని, నిజానికి వెన్నుపోటు పొడిచింది తాను కాదని, గురువుకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర మోదీదేనని అన్నారు. తనను చేరదీసి ఆదరించిన అద్వానీకి వెన్నుపోటు పొడిచింది మోదీ కాదా అని ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల అనంతరం మోదీని తీసేయాలని వాజ్‌పేయి సిఫారసు చేసినప్పుడు అద్వానీనే అడ్డుపడి మోదీని ఆదుకున్నారని, అలాంటి అద్వానీ ఎదురుపడితే నమస్కారం పెట్టే సంస్కారం కూడా మోదీకి లేదని విమర్శించారు.
మోదీ చెబుతున్నట్టు తాము పార్టీలేమీ మార్చలేదని, ఎన్టీఆర్ పేరు పెట్టిన పార్టీలోనే ప్రజాసేవ చేస్తున్నామని, ఏరోజూ తాము అవకాశవాద రాజకీయాల జోలికి పోలేదని చెప్పారు. 'ఆయన ఛాయ్ వాలా అంటారు. లక్షలు, కోట్ల రూపాయల సూటు, బూటు వేస్తారు. నేను అప్పడూ ఇప్పుడూ ఒకే తరహా డ్రెస్ వేసుకుంటాను. ఎన్నికల్లో ఓడిపోయిన సీనియారిటీ నాకు లేదని మోదీ చెబుతున్నారు. 1994, 96, 98, 99 ఇలా గెలుచుకుంటూ వెళ్లాం' అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు తాము గౌరవం ఇచ్చామంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, మీరా గౌరవం ఇచ్చింది? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగామే కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, నాకీ పని చేసి పెట్టమనో ఏరోజూ మోదీని అడగలేదని చంద్రబాబు సమాధానమిచ్చారు.
కాంగ్రెస్‌తో చేతులు కలిపారంటూ మోదే చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. కేంద్రంలోని కాంగ్రెస్‌తో, అప్పటి ప్రభుత్వ దురహంకారంతో తాము ఆనాడు పోట్లాడామని, ఇవాళ అదే స్థానంలో బీజేపీ న్యాయకత్వంలో అన్యాయం జరుగుతుంటే దేశాన్ని కాపాడేందుకు పోరాడితే తప్పేమిటని ప్రశ్నించారు. పోరాడటమే కాదు....ఇంకా గట్టిగా పోరాడతామన్నారు. లోకేష్ తండ్రి చంద్రబాబు అంటూ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని కూడా సీఎం ఎండగట్టారు. 'మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. అనుబంధాలు, ఆత్మీయతలు తెలియవు' అని మండిపడ్డారు. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని, కానీ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడంతోనే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.