టీడీపీ అధినేత చంద్రబాబు తనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాలల్లో దూకుడు పెంచుతున్నారు. పెన్షన్‌ను రెట్టింపు చేశారు. మహిళలకు పదివేల రూపాయలిస్తున్నారు. రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇలా సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూల ఓటుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబును ఓడించడానికి అన్ని శక్తులు ఏకమవుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్‌ను కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 25 సీట్ల కన్నా ఎక్కువ రానివ్వబోమన్న ఛాలెంజ్ చేస్తున్నారు. పదేపదే చంద్రబాబు మళ్లీ సీఎం కాకూదని కోరుకుంటున్న బీజేపీ.. ఈ విషయంలో ముందడుగు వేస్తోన్నట్లు తెలుస్తోంది. పవన్, జగన్ కలిస్తే ఓట్ల లెక్కల ప్రకారం టీడీపీకి ఇబ్బంది కలుగుతుందనే అంచనాలున్నాయి.
2014లో పవన్, చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. 2017 వరకు ఇలాగే ఉన్నారు. అయితే 2018లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పవన్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల నాటికి స్పష్టమైన మార్పున్నట్లే లెక్క. అది టీడీపీని ఓడించడానికి సరిపోతుందని, ఆ పార్టీని ఓడించాలని అనుకుంటున్న వాళ్లు అంచనా వేయలేదు. జగన్, పవన్‌ను కలపడం వల్ల మాత్రమే లక్ష్యాన్ని సాధించగలమని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఓడిపోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు పవన్ కలవాలని కోరుకుంటున్నారు. అందులో బీజేపీ, టీఆర్ఎస్ కూడా ఉంది. అయితే ఏపీ బయట నుంచి చంద్రబాబును ఓడించాలని ప్రయత్నిస్తున్నవారికి జగన్, పవన్‌ను కలపాలని ఉన్నా.. జగన్ మాత్ర దానికి విరుద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరినీ కలుపుకుని వెళ్లే పరిస్థితిలో లేరు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు పొత్తులకు సిద్ధంగా ఉన్నాయి. అయినా వారికి ఆరేడు సీట్లు ఇచ్చినా వృథా అనుకున్నారేమో... అందువల్ల పొత్తులు పెట్టుకోలేదు. ఒంటిరిగా పోటీ చేశారు.
ఫలితాలొచ్చిన తర్వాత చంద్రబాబు రెండు శాతం మాత్రం ఓట్లతోనే గెలిచారని పదేపదే చెప్పుకుని బాధపడ్డారు. కానీ ఆ రెండు శాతం ఓట్లు కమ్యూనిస్టుల పొత్తు పెట్టుకుంటే వచ్చేవనే విషయాన్ని మాత్రం గుర్తించడానికి సిద్ధపడలేదు. ఆ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని కలిసి పోటీ చేయడం అంటే అప్పనంగా ఇతర పార్టీలకు సీట్లివ్వడమని జగన్ భావిస్తున్నారు. అందుకు పవన్‌ను కలుపుకుంటే అవకాశాలు మెరుగుపడుతాయని ముక్తకంఠంతో అందరూ చెబుతున్నా జగన్ మాత్రం కావాలనే పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసి దూరం చేసుకుంటున్నారు. బయటి నుంచి శ్రేయోభిలాషులు ఎంతగా ఒత్తిడి చేస్తున్న ఆయన మాత్రం ఒంటరి పోటీకే మొగ్గు చూపుతున్నారు.