చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మరోసారి వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పసుపు కుంకుమ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలను నిలువరించే ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులను దూషిస్తూ దాడికి దిగారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల దాడిలో పలువురు టీడీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవతో పసుపు కుంకుమ కార్యక్రమం రసాభాసగా మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించినటువంటి పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీకి పోటీగా చెవిరెడ్డి అనుచరులు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అధికారులు, టీడీపీ నేతలు వారించినా పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల పై దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులని, అధికార తెలుగుదేశం పార్టీ వారిని అక్కడ పని చేసుకోనివ్వకుండా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు బలవంతంగా అక్కడ అధికారుల దగ్గర నుంచి చెక్కులు లాక్కుని, హంగామా చేసే ప్రయత్నం చెయ్యటంతో, అక్కడికి వచ్చిన లబ్దిదారులు కూడా షాక్ అయ్యారు. ఎంతో ఆశగా, ఇక్కడకు వస్తే, ఇలా గొడవ చేస్తున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో డ్వాక్రా మహిళలకు చెక్కులు, వృద్ధులకు పెంచిన పెన్షన్ డబ్బులు ఇచ్చి, భోజనాలు పెట్టి, బట్టలు ఇచ్చి పంపుతుంటే, ఇక్కడ మాత్రం చెవిరెడ్డి అనుచరులు కావాలని గొడవ చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు రానివ్వకుండా, అనవసర రాద్ధాంతం చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా వారిని కూడా లెక్క చెయ్యకుండా, ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతున్నారు. మరో పక్క, వీళ్ళ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. చెవిరెడ్డి ఇలా చెయ్యటం మొదటి సారి కాదు. జగన్ అండ చూసుకుని, నా ఇష్టం అంటూ రెచ్చిపోతూ ఉంటాడు. వీళ్ళు అధికారంలో లేకపోతేనే ఇలా ఉన్నారు అంటే, పొరపాటున అధికారం వస్తే, ఇక రావణ కాష్టమే.