దిల్లీలో ఫిబ్రవరి 11న నిర్వహించే ధర్మపోరాట దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి రెండు ప్రత్యేక రైళ్లును విజయవాడ నుంచి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలను చర్చించారు. శుక్రవారం సభ్యులందరూ ఉభయసభలకు నల్లచొక్కాలతో హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. అసెంబ్లీలో పునర్విభజన చట్టం అమలుపై చర్చ జరగనుందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభ సాక్షిగా చర్చ జరుపుతున్నామని అన్నారు. చర్చ అనంతరం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.
ఇదే సమయంలో ప్రత్యేక హోదా సాధన సమితి, ఇతర సంఘాలు బంద్కు పిలుపిచ్చాయని, బంద్కు వ్యతిరేకం కాబట్టి నిరసనగా ర్యాలీలు చేపట్టాలని నేతలకు సూచించారు. మనం అటు ద్రోహులతో, ఇటు నేరస్థులతో పోరాటం చేస్తున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. నేరస్థుల మైండ్ గేమ్ విభిన్నంగా ఉంటుందని, ఇందులో జగన్ నిష్ణాతుడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. భాజపాకు ఆంధ్రప్రదేశ్లో బలమేమీ లేదని, ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా 0.5 శాతం ఓట్లు కూడా రావని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. భాజపా గురించి ఆలోచిస్తూ మనం సమయం వృథా చేయడం అనవసరమన్నారు. వైకాపాకు మేలు చేసేందుకే భాజపా రాష్ట్రానికి వస్తోందని ఆయన విమర్శించారు. రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా ఉన్నవాళ్లు ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరని సీఎం మండిపడ్డారు.
యువనేస్తం భృతిని రూ.2వేలకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు. రైతులకు, కౌలు రైతులకు మేలు చేసే విధంగా వినూత్న పథకాలు తెస్తున్నామని చెప్పారు. ప్రజలకు చేసిన పనిని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పింఛన్ల పండుగ జరపాలని నేతలకు స్పష్టం చేశారు. దీన్ని పేదల పండుగగా నిర్వహించాలని, ఈ 3 రోజులు సంక్షేమ ఉత్సవాలుగా జరపాలని సూచించారు. ఫిబ్రవరి 9వ తేదీన 4 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.