ఆరుగాలాలు కష్టించి పంటలు సాగుచేసే అన్నదాతలను మరింతగా ఆదుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రైతులకు మేలు చేసేందుకు ఎలాంటి పథకం తీసుకురావాలనే విషయమై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలతోపాటు కేంద్రం ఎలాంటి అడుగులు వేయబోతోందనే అంశాన్ని నిశితంగా గమనిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టే పథకం.. ఇతర రాష్ట్రాల పథకాల కంటే గొప్పగా, కొత్తగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే అధికారులకు స్పష్టంచేశారు. అన్నదాతకు అండగా ‘రైతు రక్ష’ పేరిట సరికొత్త పథకం అమలు చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. రైతులతోపాటు కౌలు రైతులకూ మేలు జరిగేలా సాగుకు సహాయం అందించడమే లక్ష్యంగా తలపెట్టిన పథకంపై ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది.
వచ్చే ఖరీఫ్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. నగదు రూపంలో అందించే సహాయాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన విధి విధానాలను సోమవారం కేబినెట్‌లో ఖరారు చేయనున్నారు. రుణమాఫీ అమలు సమయంలో రాష్ట్రంలోని మొత్తం రైతుల సమాచారాన్ని ప్రభుత్వం పక్కాగా నిక్షిప్తం చేసింది. ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.30 కోట్ల మంది రైతులున్నట్లు అంచనా! ఇప్పుడు ఈ కుటుంబాలన్నింటికీ ‘రైతు రక్ష’ ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల సంఖ్య అధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 16 లక్షల మంది వరకు ఉన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 60 శాతంపైనే కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. కౌలు రైతులు 90 శాతానికిపైగా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వీరికి పంట రుణాలు అందించడానికే ప్రభుత్వం బ్యాంకులపై పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చింది. ఎట్టకేలకు దేశంలోనే అత్యధికంగా రూ.5 వేల కోట్ల వరకు రుణాలుగా ఇప్పించింది. ఇప్పుడు పెట్టుబడి నిధి కూడా వీరికి చెందేలా చేయాలంటే ఏం చేయాలనే విషయమై ప్రస్తుతం ఆలోచిస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో ఉండే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఈ కార్డులను అందించారు. బ్యాంకులనుంచి తేలిగ్గా రుణాలు వచ్చేందుకు ఈ కార్డులు ఉపయోగపడుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం అందించే సాయం, ఇన్‌పుట్ సబ్సిడీవంటి ప్రయోజనాలు సమకూరుతాయి. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు రక్ష పథకానికి కూడా ఈ కార్డులు ఉపకరిస్తాయి. నిజానికి... నవ్యాంధ్రలో సొంతంగా భూమిసాగు చేసుకునే రైతులకంటే కౌలు రైతులే ఎక్కువగా ఉన్నట్లు అంచనా! కౌలు రైతులను అధికారికంగా గుర్తించేందుకు అనేక సమస్యలున్నాయి. భూమి యజమానికి, కౌలు రైతుకూ మధ్య అధికారికమైన ఒప్పందం ఏదీ ఉండదు. అయినప్పటికీ కౌలు రైతులను గుర్తించి, వారికి కార్డులు జారీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.