దేశంలో అంబానీల గ్రూప్‌కి పోటీగా ఎదుగుతున్న మరో గ్రూప్ అదానీలది. గుజరాత్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించిన ఈ గ్రూపు ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితం అన్న పేరుంది. ప్రధానిగా మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించాక అదానీ గ్రూపు తన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది. అంతేకాదు- అనేక రంగాల్లోకి అడుగుపెట్టింది. తాజాగా అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటుచేసే బిజినెస్ చేపట్టింది. అదానీ గ్రూపు ఆర్ధిక పరిస్థితి కూడా బాగుండటం, వీటన్నింటికీ మించి అదానీ గ్రూపు రోజురోజుకీ ఎదుగుతుండటంతో ఆ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ గ్రౌండ్‌వర్కు ప్రారంభించారు. గత ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో అదానీ గ్రూపు ముఖ్యులను లోకేశ్ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితుల గురించి వారికి వివరించారు.
అప్పట్లో ఆసక్తి ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత అదానీ గ్రూపు ముందుకు రాలేదు. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన విన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా మరోసారి అదానీ గ్రూపుతో లోకేశ్ భేటీ అయ్యారు. అదే సమయంలో అదానీ గ్రూపు డేటా సెంటర్ల బిజినెస్‌లోకి అడుగు పెడుతోందని లోకేశ్ తెలుసుకున్నారు. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఇటీవల అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీని కలుసుకున్నారు. ఏపీలో క్లౌడ్ హబ్ పాలసీ గురించి వివరించి డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అనువైన పరిస్థితులను వివరించారు. భూమి, మౌలిక వసతుల కల్పన, వివిధ శాఖలతో సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వడం వంటి వ్యవహారాలన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేశ్ ఆహ్వానానికి అదానీ గ్రూపు సానుకూలంగా స్పందించింది.
అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందని తెలుసుకున్న మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అదానీ గ్రూపుని సంప్రదించాయి. ఏపీ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తామనీ, తక్కువ ధరకు భూములు ఇస్తామని కూడా అదానీ గ్రూపునకు ప్రతిపాదనలు వెళ్లాయి. వత్తిడి కూడా పెరిగింది. ఈలోపు అదానీ గ్రూపు ఏపీలో పరిస్థితులను మరోసారి భేరీజు వేసుకుంది. ఈ రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల గురించి, అనంతపురంలో కియా, చిత్తూరుజిల్లా శ్రీసిటీలో ఏర్పాటవుతున్న పరిశ్రమల గురించి తెలుసుకుంది. వీటితోపాటు అమరావతి అభివృద్ధి చెందుతున్న తీరు, ఐటీ కారిడార్‌గా విశాఖపట్నం ఎదుగుతున్న వైనం వారిని ఆకట్టుకున్నాయి. దీంతో అదానీ గ్రూపు ఏపీ వైపే మొగ్గుచూపింది. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తమకి పనికి వస్తుందని నమ్మింది.
ఈ సందర్భంగా అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎవరికీ చెప్పకుండా విజయవాడ ఎయిర్‌పోర్టులో వాలిపోయారు. ఆయన విజయవాడకు వచ్చే విషయం రెండు గంటల ముందు వరకు కూడా ఎవరికీ తెలియదు. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్, ఆ శాఖ అధికారులు స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. వెంటబెట్టుకుని మరీ సీఎం నివాసానికి తీసుకువెళ్లారు. సుమారు గంటసేపు చంద్రబాబుతో చర్చలు జరిగాయి. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోడేటా సెంటర్ల ఏర్పాటుకు వచ్చే అయిదేళ్లలో 70 వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూపు చెప్పింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఎం.ఓ.యూ కూడా కుదుర్చుకుంది. పరిశ్రమల ఏర్పాటుకోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న గ్రౌండ్‌వర్క్ చివరి నిముషం వరకూ ఎవరికీ తెలియనివ్వడం లేదు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితమైన అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టడం, స్వయంగా గ్రూపు ఛైర్మన్ అదానీయే ఏపీకి రావడం, చంద్రబాబుతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.