రాజమహేంద్రవరం కీర్తి ప్రతిష్టలో మరో వైభవం జత కలవనుంది. రాజమహేంద్రవరం విమానాశ్రయం అతి పెద్ద విమానాశ్రయంగా అవతరించనుంది. కేవలం రెండు, మూడు నెలల్లోనే ఇది అమలులోకి రానుంది. ఇక ప్రపంచ ఎయిర్‌పోర్టుల చార్ట్‌లలో రాజమహేంద్రవరం పేరు గర్వంగా ఉంటుంది. రన్‌వే విస్తరణ ఆదివారం నాటికి పూర్తి కానుంది. కొన్ని అనుమతులు లభించిన వెంటనే ఈ విమానాశ్రయం పెద్ద విమానాశ్రయం అవుతుంది. ప్రస్తుతం 16 విమానాశ్రయాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై సర్వీసులు నడుస్తున్నాయి. విస్తరించిన రన్‌వే ప్రారంభమైన తరువాత ఢిల్లీ, తిరుపతి, ముంబై వంటి ప్రాంతాలకు కూడా విమానాలు నడుస్తాయి. ప్రస్తుతం రోజుకి 1200 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది 3.5 లక్షల మంది ప్రయాణించారు.
ఇక్కడ గతంలో కేవలం 1750 మీటర్ల రన్‌వే ఉండేది. దానిని విస్తరించడంతో దీని పొడవు 3165 మీటర్లకు చేరింది. రన్‌వే వెడల్పు 45 మీటర్లు. దానికి ఇరువైపులా 7.5 మీటర్ల చొప్పున సేఫ్టీ షోల్డర్స్ నిర్మించారు. ఈ విమానాశ్రయం అభివృద్ధిని రూ.181 కోట్లతో చేపట్టారు. రన్‌వే విస్తరణ ఒక ప్రత్యేక సమయాల్లో నిర్మించినట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విమానాల రాకపోకలు ఉండడం వల్ల పగటి పూట పని చేయడానికి వీలు లేదు. ప్రతీరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పనులు చేసేవారు. 7 గంటల తరువాత రన్‌వేలో ఏ విధమైన ఆటంకం లేకుండా క్లీన్ చేసి విమానాలు తిరగడానికి వీలుగా చేసేవారు. రన్‌వే నిర్మాణం కోసం కాంక్రీట్ మిక్చర్ మెటీరియల్‌ను కొంత సమయం ముందుగానే రెడీ చేసుకుని రన్‌వే నిర్మించారు.
రన్‌వే పూర్తి అయినప్పటికీ సేఫ్టీ విషయంలో అనుమతి లభించాల్సి ఉంది. సీ17 వంటి పెద్ద విమానాలు కూడా ఇక్కడ దిగే అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదలై ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్ధమవుతుంది. రన్‌వేతో పాటు కార్గో కూడా మొదలవుతుందని విమానాల్లో బెల్లీ కార్గో సౌకర్యం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీ సమీపంలోనే ఉండటంతో పాటు, ఓఎస్టీసీ గెయిల్, జీఎస్పీసీ వంటి సంస్థలు కేజీ బేసిన్లో కార్యకలాపాలు విస్తరించడంతో ఈ ఎయిర్ పోర్ట్ కు బహుముఖంగా దోహదపడుతోంది. ఒక వైపు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఫ్లొరీ కల్చర్, చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తుల ఎగుమతులకు ఈ విమానాశ్రయం దోహదపడే విధంగా రన్వేను విస్తరించారు.