టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి సంవత్సరం తన స్వంత గ్రామమైన నారావారిపల్లె సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాతీగా పాటిస్తున్నారు. అందులోభాగంగా ఈ యేడాది కూడా నారావారిపల్లె నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత షర్మిల తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం టీడీపీయేనని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. టీడీపీపై షర్మిల ఎందుకు ఆరోపణలు చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నీతివంతమైన రాజకీయాలకే తాము కట్టుబడి ఉన్నామని, షర్మిల వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగారో తెలియలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ పోలీసులుపై నమ్మకం లేకనే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలకు, కోడి కత్తి కేసు విషయంలో కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కలిపి సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు ఏపీలో రాజకీయం ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. దుష్ప్రచారం చేస్తున్నారని పక్క రాష్ట్రంలో కేసులు పెడతారా అని చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల పై నమ్మకం లేదంటారు, అసెంబ్లీ పై నమ్మకం లేదంటారు, సచివాయలం పై నమ్మకం లేదంటారు, రాజధాని పై నమ్మకం లేదంటారు, పోలవరం పై నమ్మకం లేదంటారు, కాని సియం కుర్చీ పై మాత్రమె నమ్మకం ఉంటుంది అని అన్నారు.
అర్హులకు పెన్షన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘జిల్లాలో సమస్యలు చాలా వరకు తగ్గాయి. దేశంలో లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ధనిక రాష్ట్రాలు కూడా చేయలేని పథకాలు అమలు చేశాం. అభివృద్ధి పక్కాగా చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. మరో పక్క అమరావతి, పోలవరం పూర్తి చేస్తున్నాం. కేంద్రం సహకారం లేకపోయినా, ఎవరికీ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తున్నాం. ఉద్యానవన పంటల ద్వారా ఆదాయం, ఆరోగ్యం. గ్రామాల్లో ఎటు చూసినా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. మట్టిపై నడవడం కూడా ఆరోగ్యానికి మంచిది’’ అని చంద్రబాబు సూచించారు.