బీజేపీ వ్యతిరేక కూటమి తమ బలాన్ని, ఐక్యతను చూపించటానికి, మరో భేటీకి సిద్ధమైంది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 19న కోల్‌కతాలో సమావేశం కానుంది. అదే రోజున కోల్‌కతాలో జరిగే తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం నేతలంతా భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒక రోజు పర్యటన కోసం మంగళవారం దిల్లీ వచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు నేతలతో సమావేశమయ్యారు. తొలుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో ఆయన నివాసంలో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి భోజనం చేశారు. తర్వాత శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనతోపాటు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాలతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.
‘ఈనెల 19వ తేదీన కోల్‌కతాలో జరిగే ర్యాలీకి మమతా బెనర్జీ మా అందరినీ ఆహ్వానించారు. దీనిపై శరద్ పవార్‌తో మాట్లాడాం. వెళ్లాలని నిర్ణయించాం. మిగతా పార్టీలవారూ వస్తారని అనుకుంటున్నాం. 19వ తేదీ మేమంతా అక్కడ కలిస్తే చర్చించుకుంటాం. అవసరమైతే ఢిల్లీలోనూ సమావేశమై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. ఈ ర్యాలీకి ఎన్ని పార్టీలు హాజరవుతాయనుకుంటున్నారన్న ప్రశ్నకు... రేపో, ఎల్లుండో ఆ విషయం చెబుతామన్నారు. ఒకవైపు పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నా మరోవైపు ఉత్తర్ ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ సొంతంగా సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి కదా? అన్న ప్రశ్నకు... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు.
‘దేశంలో ప్రస్తుతం డెమోక్రాటిక్ కంపల్షన్ ఉందని తొలి నుంచీ నేను చెబుతున్నా. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందువల్ల అన్ని పార్టీలు చేతులు కలపాలి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు ఇబ్బందులున్నప్పటికీ జాతీయ స్థాయిలో అందరూ కలిసి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నాం. లౌకిక పార్టీలన్నింటినీ భాజపా వ్యతిరేక వేదికపైకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం అందించాల్సిన బాధ్యత సీనియరు నాయకులుగా మాపై ఉంది’ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీతో సాధారణ అంశాలపైనే చర్చ జరిగినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరోసారి నేతలందరితో మాట్లాడబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 4 గంటలే దిల్లీలో గడిపారు. రాత్రి 7 గంటలకు దిల్లీ చేరుకున్న ఆయన 11 గంటలకల్లా బయలుదేరి అర్ధరాత్రికి విజయవాడ చేరుకున్నారు.