‘ప్రధాని మోదీవన్నీ అబద్ధాలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, సీఎం చంద్రబాబుపైనా చేసినవ్యాఖ్యలు అనుచితం. ఆయనకు అహం బాగా పెరిగిపోయింది. ఆయనకు తగ్గట్లే రాష్ట్రంలోని భాజపా నాయకులు ముఖ్యమంత్రిని పట్టుకుని... మోసకారి, అబద్ధాల కోరని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు’ అని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు ధ్వజమెత్తారు. భాజపాను భారతీయ జుమ్లా (మోసపూరిత హామీలతో పొద్దుపుచ్చే) పార్టీగా అభివర్ణించారు. అబద్దాల ప్రధానిగా నరేంద్రమోదీ, తప్పుడు పార్టీగా భాజపా చరిత్రలో నిలిచిపోతాయని కుటుంబరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన రూ.1,050 కోట్లకు యూసీలు ఇవ్వలేదని ఐదు పార్లమెంటు స్థానాల వీడియో సమావేశంలో ప్రధాని మోదీ ప్రస్తావించడం పచ్చి అబద్దమని పేర్కొన్నారు.
నీతిఆయోగ్ నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు 2018 డిసెంబరు 18న పంపిన లేఖలో ఏపీ ప్రభుత్వం రూ.1,049.34 కోట్లకు యూసీలు ఇచ్చినట్లు స్పష్టంగా పేర్కొందని, రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావుకు ఇచ్చిన జవాబులో 2018 జనవరి వరకు రూ.946.50 కోట్లకు ఏపీ ప్రభుత్వం యూసీలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి చెప్పారని కుటుంబరావు వివరించారు. ఆ తరువాత ఇచ్చిన యూసీలను కూడా క్రోడీకరించి నీతిఅయోగ్ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసిందని తెలిపారు. నీతిఆయోగ్ ఛైర్మన్‌గా ఉన్న ప్రధాని నరేంద్రమోదీకి లేఖ తెలియదంటే ప్రభుత్వాన్ని ఆయన ఏవిధంగా నడుపుతున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం కూడా తెలియదంటే పీఎంవో నిర్వాకమో, భాజపా రాజకీయమో ప్రజలే అర్థం చేసుకోవాలని విమర్శించారు. విద్యాపన్ను కింద వసూలుచేసిన రూ.82 వేల కోట్లు ఇప్పటివరకు ఎందుకు ఖర్చు చేయలేదో నరేంద్రమోదీ చెబుతారా? అని ప్రశ్నించారు.
యూసీలు ఇవ్వడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో వెల్లడించడం ప్రధానికి తెలియదా? భాజపా పాలిత రాష్ట్రాలకు యూసీలు ఇస్తేనే నిధులిస్తున్నారా? గుజరాత్, మహారాష్ట్ర ఎన్ని యూసీలు ఇచ్చిందని భారీగా నిధులిస్తున్నారని కుటుంబరావు ధ్వజమెత్తారు. ఏపీ పట్ల వివక్షకు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ‘అహంకారాన్ని, అహంభావాన్ని సహించబోమని ఎన్టీఆర్ అనాడే చెప్పారు. ఆయన పోరాడింది దిల్లీపైన. ఆ రోజు దిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు భాజపా ఉంది. భాజపా, కాంగ్రెస్ కలిసే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాయి. భాజపా ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబుతోంది. కాంగ్రెస్ ఇస్తామంటోంది. అలాంటి కాంగ్రెస్‌తో తెదేపా స్నేహపూర్వకంగా ఉంటే తప్పా? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ ఏ కూటమిలో ఉంటే తెదేపా దానితోనే ఉంటుంది’ అని కుటుంబరావు స్పష్టం చేశారు.