వైసీపీలో, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తరువాత నెంబర్ 2గా వెలుగొందుతున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి లెక్కకు మించిన పదవులున్నాయి. కేంద్రంలోనూ ప్రభుత్వ పెద్దల కరుణా కటాక్ష వీక్షణాలతో చాలా పదవులు దక్కించుకున్నారు. అయితే అనూహ్యంగా ఓ పదవి గురించి తన సోషల్మీడియాలో గొప్పగా విజయసాయిరెడ్డి ప్రచారం చేసుకున్నారు. ఈ నెల 5న విజయసాయికి పంపిన లేఖలో ప్యానల్ వైస్ చైర్మన్ గా నియమించినట్లు రాజ్యసభ ఆఫీస్ సమాచారం ఇచ్చింది. దీంతో అందరినీ ఊరిస్తున్నట్లు, కొందరిని వెటకరిస్తున్నట్టు సాయిరెడ్డి తన అధికారిక సోషల్మీడియాలో పోస్టులు చేశారు. అయితే రాజ్యసభలో కొత్తగా నియమించిన ప్యానల్ వైస్ చైర్మన్ల పేర్లను రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. ఇందులో విజయసాయి పేరు లేదని ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది. ఇదే నిజమైతే సాయిరెడ్డి నుంచి మరో పదవి చేజారినట్టే.
news
రాజ్యసభ మొదటి రోజే, ఏపి పై బాంబు పేల్చిన కేంద్రం....
అన్నదాతగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారింది. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ కాదు. కేంద్ర ప్రభుత్వమే ధ్రువీకరించిన కఠోర వాస్తవం. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాదకద్రవ్యాల సరఫరా, వాడకం, స్వాధీనం వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా ఏపీలో డ్రగ్స్ దొరికినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేసిందని జవాబు ఇచ్చింది. డీఆర్ ఐ గణాంకాల ప్రకారం 2019 నుంచి 2021 వరకు దేశంలోనే పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్రం వెల్లడించింది. డీఆర్ఐ ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ పేరుతో తయారుచేసిన నివేదికలోనూ దేశంలోనే ఏపీ రాష్ట్రంలో అతిఎక్కువ డ్రగ్స్ పట్టుబడ్డాయని పేర్కొంది. 2021-22 సంవత్సరంలో అత్యధికంగా ఏపీలో 18,267.84 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయని వెల్లడించారు. వీటిలో బ్రౌన్ షుగర్, హెరాయిన్, ఓపియం, మార్ఫిన్, గంజాయి ఉన్నాయి.
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత...జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసుల మొహరింపు..
జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న నిరసనకి దిగి కలకలం రేపుతున్నారు. సంచలన వ్యాఖ్యలతో నిత్యమూ వార్తల్లో నిలిచే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. తాడిపత్రి మున్సిపల్ పరిధిలో మరమ్మతులకు నోచుకోని వాహనాలకు నిధులు కేటాయించని ప్రభుత్వం తీరుకు నిరసనగా భిక్షాటన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పాడైపోయిన వాహనాలతో పట్ణణంలో పర్యటిస్తూ నిరసనకు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధం అయ్యారు. అయితే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటిలో నుంచి బయటకు రాకుండా ఇంటి చుట్టూ పోలీసులను మొహరించారు. రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపాలిటీలో టిడిపి జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టిడిపికి చెందిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మున్సిపాలిటీ పాలనా వ్యవహారాలు, నిధుల విషయంలో విభేదాలు తీవ్రం అయ్యాయి.
వైసీపీ బీసీ సభ దెబ్బకు, అతలాకుతులం అవుతున్న బెజవాడ... ఇదేమి కర్మ బెజవాడకు ?
బెజవాడలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయ్యింది. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న జయహో బీసీ సభ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఒక రోజు ముందు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు వుంటాయని పేర్కొన్నారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి బయలుదేరిన వాహనాలు ఈ ట్రాఫిక్ ఆంక్షలు తెలియక గందరగోళానికి గురయ్యారు. సదస్సుకు జనాన్ని తరలించేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు పార్కింగ్ ప్రదేశం ఎక్కడో తెలియక ఎక్కడికక్కడ బస్సులు ఆపేశారు. అలాగే ట్రాఫిక్ మళ్లింపు సమాచారం తెలియని వాహనాలు దారులతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కనకదుర్గమ్మ వారధి నుంచి విజయవాడ వచ్చే మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో జయహో బీసీ సభకు జనాలు చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న సామాన్యప్రజలు బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు.