చుక్కల భూముల పేరుతో రాష్ట్రంలో మరో కుట్ర జరగబోతోందంటూ హీరో శివాజీ ఒక్క సారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది అధికారులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు అపాయింట్మెంట్ను కోరినట్టు, చంద్రబాబును కలిశాక ఈ కుట్ర వెనుక ఎవరున్నారో ఆయనకే చెబుతానంటూ శివాజీ తెలిపారు. అయితే గుంటూరులోని అచ్చంపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఏపీకి అన్యాయం చేస్తోందని కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పవన్‌కల్యాణ్ కూడా పోరాడాలని, రాష్ట్రం కోసం పవన్ కల్యాణ్ తమతో కలిసిరావాలని కోరారు. ఒకరు బీజేపీతో పూర్తిగా కలిసిపోయారని, ఇంకొకరు వన్‌సైడ్‌గా పనిచేస్తున్నారన్నారు. పవన్ కలిసి వస్తారో లేక ఒంటరిగా పోటీ చేస్తారో ఆయన వ్యక్తిగత విషయమన్నారు. అదే విధంగా శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఎస్టేట్, కోఆపరేటివ్ భూముల సమస్యలను ఈ నెలాఖరులోపు పరిష్కరించాలన్నారు. శివాజీ చెబుతున్నట్లు అధికారులు వ్యవహరిస్తే ఆధారాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటామన్నారు.
దీర్ఘకాలంగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈనెల 24 నాటికి పరిష్కరించాలని ప్రభుత్వం శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తనంతట తానుగా చుక్కల భూములు పునఃపరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. 1954లో భూముల రీసర్వే జరిగినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సర్వేనంబర్ వారీగా ఖాతాదారుల పేర్లు, విస్తీర్ణం నమోదు చేశారు. అయితే ఎవరూ యాజమాన్య హక్కు కోరని భూముల వద్ద రికార్డుల్లో చుక్కలు (డాట్స్) పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఈ భూములను చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్స్)గా పిలుస్తున్నారు. 1954 తర్వాత ఆ భూములను సాగు చేసుకునే వారికి ఎటువంటి యాజమాన్య హక్కులూ లేవు. వాటిని బదిలీ చేసుకునే, అమ్ముకునే అవకాశం లేదు.
దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూమి హక్కుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఇది పెద్దసమస్యగా తయారైంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజిస్ర్టేషన్ చట్టం-1908లోని 22(ఏ1)లో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి చుక్కల భూములను తొలగిస్తూ 2017 జూలై 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం... రైతుల ఆధీనంలో సాగులో ఉన్న చుక్కల భూములను ప్రైవేటు పట్టాభూములుగా పరిగణిస్తారు. చుక్కల భూములకు సంబంధించిన సర్వేనంబర్లు, ఇతర వివరాలను రెవెన్యూశాఖ ఆయా జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతుంది. ఆ భూములను స్వాధీనంలో ఉంచుకున్నవారు, సాగు చేసుకుంటున్నవారు ప్రభుత్వం నిర్ణయించిన పత్రాలలో ఏదో ఒకటి చూపిస్తే ఆ భూమి వారికి సంబంధించినదిగా రిజిస్టర్లో నమోదు చేస్తారు. 2017 జూలై 14వ తేదీకి ముందు 12 ఏళ్లు ఆధీనంలో ఉన్నట్లు ఏవైనా ఆధారాలు చూపినా రిజిస్టర్లో వారి పేరు నమోదు చేస్తారు.