గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామంలో యరపతినేని నరసింహారావు కారు కింద అమర్చిన బక్కెట్ బాంబుల సూత్రధారి, పాత్రధారి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డేనని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం మంచికల్లులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యరపతినేని మాట్లాడుతూ పతనావస్థలో ఉన్నప్పుడు ఇలాంటి నీచ ఆలోచనలు పుడతాయన్నారు. కుటిల రాజకీయాలు, హింస, దౌర్జన్యం, బాంబుల సంస్కృతి తమ కుటుంబానికి ఎప్పుడూ లేదన్నారు. యరపతినేని నరసింహారావు తమ కుటుంబీకుడు, రక్తసంబంధీకుడని.. తమ కుటుంబాల మధ్య ఘర్షణలు సృష్టించి పబ్బం గడుపుకునే ప్రక్రియలోనే బాంబులు అమర్చారని యరపతినేని పేర్కొన్నారు.
పార్టీ మారినంత మాత్రాన ఎమ్మెల్యే పీఆర్కేకు నరసింహారావు మీద ప్రేమ ఉండదని, గ్రామాన్ని పాడు చేయడమే వారి ధ్యేయమన్నారు. 2004 వరకు ఎలాంటి అలజడులు లేవని, కాంగ్రెస్ హయంలో 2010 జనవరిలో తనను, అప్పటి నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డిని గ్రామంలోకి రానీయలేదని గుర్తు చేశారు. వేలాది మంది కార్యకర్తల కోసం భోజనం తయారు చేస్తే పోలీసులతో కుక్కలకు వేయించారని, ఇంత కన్నా నీచమైన సంస్కృతి ఇంకేముంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. త్వరలో తాను మంత్రినని, జగన్ సీఎం అని చెప్పుకోవడం హాస్యాస్పదమని యరపతినేని ఎద్దేవా చేశారు.
నరసింహారావు సోదరుడు యరపతినేని మట్టయ్య మాట్లాడుతూ తామంతా ఒక తల్లి పిల్లలమని, తమ కుటుంబాలను చీల్చడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. బక్కెట్ బాంబుల నిగ్గు తేల్చే బాధ్యత పోలీసులదేనన్నారు. రెంటచింతల మండలం మంచికల్లులో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు 15 నాటుబాంబులు లభ్యం కావడంపై ఆ ప్రాంతంలోనే కాదు.. జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. బాంబులు పట్టుబడింది గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగృహం సమీపంలోనే. పోలీసు జాగిలాలు అక్కడికి వెళ్లి ఆగిపోయాయి. దీన్నిబట్టి ఎమ్మెల్యే యరపతినేనిని లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టమవుతుంది. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో బాంబులు బయటపడటం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని పల్నాడు వాసులు కోరుతున్నారు.