14.46 ఎకరాలలో 12 టవర్లలో నిర్మిస్తున్న 1200 అత్యాధునిక గృహాల నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీ నెస్ట్’కు రెండు విడతల్లోనూ అనూహ్య స్పందన వచ్చిందని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి చెప్పారు. నవంబర్ 9న 300 నివాసాలకు, ఈనెల 10న మరో 1200 ఇళ్లకు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌లు చేపడితే, ప్రపంచం నలుమూలల నుంచి భారీ స్పందన వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా రెండో విడత బుకింగ్‌ తొలి రెండు గంటల్లోనే పూర్తి కావడం తమనే ఆశ్యర్చపరచిందని అన్నారు. దేశవ్యాప్తంగా 659 మంది హ్యాపీనెస్ట్ కోసం బుకింగ్ చేసుకోగా, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి 175 మంది, సింగపూర్ నుంచి 13 మంది, గల్ఫ్ దేశాల నుంచి 12 మంది, ఆస్ట్రేలియా, యుకే నుంచి ఏడుగురు చొప్పున ఇళ్లను బుక్ చేసుకున్నారని చెప్పారు.

amaravatibookings 13122018

ఇంకా, ఖతర్, కెనడా, బహ్రేన్, మలేసియా, ఒమన్, సౌదీ అరేబియా, ఇతర దేశాల నుంచి మరో 27 మంది హ్యాపీనెస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణా నుంచి 231 మంది, కర్నాటక నుంచి 106 మంది హ్యాపీనెస్ట్ కోసం బుకింగ్ చేసుకున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 19,351 మంది ఈ వెంచర్ పట్ల ఆసక్తి ప్రదర్శించారని, ఇప్పటికీ వందలాది కాల్స్ వస్తున్నాయని చెప్పారు. వెంటనే మరో ప్రాజెక్టు చేపడితే ముందస్తు రుసుము చెల్లించడానికి 3,394 మంది ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఈ అనూహ్య స్పందన గురించి విన్న ముఖ్యమంత్రి, వెంటనే మరో ప్రాజెక్టుకు సన్నాహాలు చేసుకోడానికి అధికారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

amaravatibookings 13122018

వాస్తుకు పూర్తి అనుగుణంగా, అదే సమయంలో ‘స్మార్ట్‌’గా, పర్యావరణహితంగా, సకల ఆధునిక వసతులతోపాటు చూడగానే ఆకట్టుకునే రూపం, సువిశాల క్లబ్‌హౌస్‌ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలతో జెనెసిస్‌ సంస్థ రూపొందించిన డిజైన్‌ ప్రకారం హ్యాపీనెస్ట్‌ నిర్మితం కానుంది. హ్యాపీనె్‌స్టకు సంబంధించిన ప్రధాన ఆకర్షణ దాని లొకేషన్‌! అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌, ప్రభుత్వ గృహసముదాయాలతో కూడిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు ఇంచుమించుగా పక్కన, నేలపాడుకు చేరువలో ఇది రానుంది. అటూ ఇటూ 82అడుగుల వంతున వెడల్పుతో సాగే విశాలమైన 2 రహదారుల మధ్యన ఉన్న కార్నర్‌ ప్లాట్‌లో 14.46 ఎకరాల్లో హ్యాపీనెస్ట్‌ నిర్మితం కానుంది. ఇందులో ఒక్కొక్కటి రెండేసి పార్కింగ్‌ ఫ్లోర్లు, గ్రౌండ్‌ ప్లస్‌ 18 అంతస్థులుండే 12టవర్లు వస్తాయి. వీటిల్లో మొత్తం 1200 డబుల్‌, ట్రిబుల్‌ బెడ్‌రూం ప్లాట్లు ఉంటాయి.

రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు పడుతోంది. పరిపాలన నగరంలో ముఖ్యమైన సచివాలయ నిర్మాణ పనులు ఈనెల 19వ తేదీ నుంచి వేగిరం కానున్నాయి. ఐదు టవర్లుగా నిర్మిస్తున్న సచివాలయం కోసం అదే రోజు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఆరంభం కానున్నది. దేశంలోనే అత్యంత భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌గా ఇది అరుదైన ఖ్యాతిని నమోదు చేసుకోబోతోంది. 12 వేల క్యూ.మీ. మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరగనున్నదని, దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదేనని బుధవారం సాయంత్రం ప్రజావేదికలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

amaravati 13122018 2

రాజధానిలో నూతన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యంత భారీ భవంతులకు దీటుగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా అదే స్థాయిలో చేపడుతున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణశిల్పి నార్మన్‌ ఫోస్టర్‌కి చెందిన ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్‌ సంస్థ సచివాలయం కోసం ఐదు టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను, నిర్మాణ ప్రణాళికలను సీఆర్‌డీఏకు అందించింది. ఈ ఐదు టవర్లను ఒకే రాఫ్ట్‌ ఫౌండేషన్‌పై నిర్మిస్తున్నామని, అందుకోసం వేల మంది కార్మికులను, వందల సంఖ్యలో యంత్రాలను, టన్నుల కొద్ది నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ అద్భుత ప్రణాళిక, సీఆర్‌డీఏ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏకధాటిగా పూర్తి చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశామని వివరించారు.

amaravati 13122018 3

అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో గల ఎత్తయిన పర్వత ప్రాంతంపై చేపడుతున్నారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్ అసోసియేట్స్’ రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పరిశీలించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా ఆ ప్రాంతాన్ని ముఖ్య వాణిజ్యకూడలిగా రూపొందించడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్ధసారధికి సూచించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా నిర్మించాలని సమావేశంలో అత్యధికులు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు.

ప్రజలకి మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వానికి నేరుగా తమ సమస్యలు చెప్పుకునే లేదా ఏదైనా సమాచారం ఇచ్చే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది. అందులో భాగంగా సచివాలయంలో ప్రతి శాఖకు ఒక శాశ్వతమైన ఈ మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది.

email 12122018 2

దీని ప్రకారం సచివాలయంలోని 36 శాఖలకు సంబంధించిన శాఖాధికారులు తమ శాఖల మెయిల్స్ ను గంటకొకసారి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. అంతేగాక అధికారులు తమ స్మార్ట్ ఫోన్స్ తో ఆయా శాఖల మెయిల్స్ ను అనుసంధానం చేసుకొని ప్రజల నుంచి వచ్చే సందేశాలను పరిశీలిస్తారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ఉత్తర్వులు జారీ చేశారు .

email 12122018 3

విశాఖను మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటవుతున్న మెడ్‌టెక్ జోన్‌ను ఇవాళ చంద్రబాబు ప్రారంభించనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్‌కు సాగర తీరం కేంద్రం కావడం విశేషం. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. మెడికల్ డిస్పోజబుల్స్‌, వైద్య రంగంలో వినియోగించే యంత్ర పరికరాలు, సర్జికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఇంప్లాంట్స్‌, వ్యాధి నిర్ధారణతో పాటు ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత. దేశీయంగా దాదాపు 800 వైద్య ఉపకరణాల తయారీ యూనిట్లు పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. అయితే.. ఖరీదైన యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రం ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా వినియోగిస్తున్న పరికరాలలో 65శాతం ఇప్పటికి దిగుమతవుతున్నాయి. వీటికి పరిష్కారంగానే విశాఖ పార్క్ డెవలప్ చేస్తారు.

medtech 13122018 2

ఆసియాలో జపాన్‌, చైనా, సౌత్ కొరియాల తర్వాత వైద్య పరికరాలు తయారయ్యే అతిపెద్ద పార్క్‌ మెడ్‌టెక్‌‌ జోన్‌ మాత్రమే. ఏటా 17 శాతం వృద్ధితో 5 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న వైద్య పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ జోన్‌ కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. నేషనల్‌ మెడికల్‌ డివైస్‌ పాలసీలో భాగంగా విశాఖలో రెండేళ్ల క్రితం 270 ఎకరాలు కేటాయించింది. 30 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ మెడ్‌టెక్‌ జోన్‌లో యూనిట్ల ఏర్పాటు కోసం 25 సెంట్లు, 50 సెంట్లు, ఎకరా, రెండెకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను సిద్ధం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారయ్యే పరికరాల నాణ్యతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించనున్నారు. గామా ఇరాడినేషన్, బయో మెటిరియల్ టెస్టింగ్, 3డి ప్రింటింగ్‌, ప్రో టైపింగ్, ర్యాపిడ్ టూలింగ్, ఎక్స్‌ రే, సిటి స్కాన్ ట్యూబ్ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా వ్యాధుల నిర్ధారణ భారం కూడా ప్రజలకు గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం దేశీయ ల్యాబ్ టెస్టుల ధరలు 40శాతం తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

medtech 13122018 3

మెడ్‌టెక్‌ జోన్‌ ఫేజ్1 లో 13 ఎకరాల విస్తీర్ణంలో కామన్ ఫెసిలిటిస్‌ అభివృద్ధి చేశారు. ఎకరం విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్, మరో ఎకరం విస్తీర్ణంలో మెడ్ ఎక్స్‌పో హాల్ నిర్మించారు. కామన్‌ సోషల్ అండ్ సపోర్ట్ ఫెసిలిటిస్‌ 11 ఎకరాలలో అభివృద్ధి చేశారు. రెండెకరాల విస్తీర్ణంలో ఓవర్ హెడ్‌ ట్యాంక్ నిర్మాణం చేశారు. టెస్టింగ్ సెంటర్లు, మార్కెటింగ్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెగ్యులేటింగ్‌ అథారిటీ, కేంద్రం తరపున ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ కలిసి తయారీదారుల కోసం మాన్యుఫ్యాక్చరర్ల అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. ఏదైన సంస్థ మెడ్‌టెక్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటే ప్లగ్‌ అండే పే, రెడీ టూ మూవ్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. మెడ్‌ టెక్‌ జోన్‌ లో దాదాపు వందకుపైగా తయారీ సంస్థలు వస్తే దాదాపు 20 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది ఏపీ ప్రభుత్వం.

Advertisements

Latest Articles

Most Read