తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. కర్ణాటక తరహా వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికోసం కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్‌ను ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అత్యధిక స్థానాలు కలిగిన పెద్ద పార్టీగా భాజపా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ మాత్రం రాలేదు. జేడీఎస్, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.
అయితే గవర్నర్ మాత్రం రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం భాజపా నేత యడ్యూరప్పను సీఎంగా నియమించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్ , జేడీఎస్ శాసనసభ్యులు భాజపా వైపునకు వెళ్లకుండా చేయడంలో డీకే శివకుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఆయన పేరు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడింది. ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న డీకేను తెలంగాణలో రంగంలోకి దింపడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒక వేళ హంగ్ ఏర్పడితే డీకే ఎలాంటి వ్యూహం అనుసరించనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి తక్కువ సమయమే మిగిలి ఉండటంతో రేపు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఏఐసీసీ పెద్దలు సైతం ఈ సాయంత్రానికే హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఇప్పటికే తెరాసకు మజ్లిస్ పార్టీ మద్దతు ప్రకటించడం.. సీఎం కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ కావడంతో కాంగ్రెస్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. ఏ పార్టీకీ మెజార్టీ దక్కకుండా హంగ్ ఏర్పడితే స్వతంత్ర అభ్యర్థుల సాయంతో గట్టెక్కాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులతో ఆ పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వేలు తెరాసకు అనుకూలంగా ఉండగా.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం బృందం చేసిన సర్వేలో ప్రజాకూటమికి విజయావకాశాలు ఉన్నట్లు తేలిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేపు వెల్లడయ్యే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.