ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. ఉత్తరాదిలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీని కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఉత్తరాదినే బీజేపీ కోటకు బీటలు వారుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ వేరుపడిన తర్వాత కాంగ్రెస్ అజిత్‌జోగిని సీఎం చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు బీజేపీ విజయ ధుంధుభి మోగించింది. మూడు పర్యాయాలు ఛత్తీస్‌గఢ్‌ను ఏకఛత్రాధిపత్యంగా రమణ్‌సింగ్ ఏలారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఛత్తీస్‌గఢ్ ప్రజలు తిరష్కరించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 65 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంద. బీజేపీ 16 స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడ్డాయి. ఇక్కడ మ్యాజిక్ మార్కును కాంగ్రెస్ చేరుకుంది. రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌కే పట్టం కట్టబోతున్నారు.
తెలంగాణలో మాత్రం బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే పరిపూర్ణానందను బీజేపీలోకి చేర్చుకుంది. అంతేకాదు యూపీ తరహాలో ఎత్తుగడ ఇక్కడ అమలు చేయాలని భావించి బోర్లాపడింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో.. అత్యధిక స్థానాల్లో నాటోకు వెయ్యికి పైగా ఓట్లు పోలయ్యాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5864(సాయంత్రం 4 గంటల వరకు) ఓట్లు నోటాకు వచ్చాయి. అలాగే ఖమ్మం, ములుగు నియోజకవర్గాల్లో జాతీయపార్టీ బీజేపీ అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ప్రధాని మోదీ, అమిత్‌షా మొదలుకుని కేంద్రమంత్రులు విస్తృతంగా పర్యటించారు. రెండంకెల సీట్లు గెలుచుకుంటామని ప్రకటించిన బీజేపీ.. కనీసం రెండు సీట్లయినా దక్కించుకోలేకపోయింది. పార్టీ అగ్రనేతలైన లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు చింతల రామచంద్రా రెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రం గెలిచి కాస్త పరువు దక్కించారు.
గత ఎన్నికల్లో నగరంలోని అంబర్‌పేట, ఖైరతాబాద్, ఉప్పల్, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని తన బలాన్ని 5 సీట్లకు పెంచుకుంది. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్లింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. చివరి క్షణాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వలస వచ్చిన వారికి కూడా టికెట్లిచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. అయితే ఇంట ఘోర పరాజయం మూట కట్టుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ నేతలు మాత్రం, అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయామన్న బాధ కంటే, చంద్రబాబు వ్యూహాలు తెలంగాణాలో పని చెయ్యలేదు అని సంతోషంలో ఆనంద తాండవం చేస్తున్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అధికారం కోల్పోయినా, జీవీఎల్ లాంటి వారు మాత్రం, 13 స్థానల్లో పోటీ చేసి, 2 స్థానాల్లో విజయం సాధించిన తెలుగుదేశం పై, చంద్రబాబు పై వెటకారపు మాటలు మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మన కుండకి బొక్క పడిన సంగతి మర్చిపోయి, ఎదుటి వాడిని చూసి నవ్వుతున్నారు. ఇలా ఉంది మన రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన పరిస్థితి.